దేవుడా ఏమిటీ పరీక్ష? పాకిస్థాన్‌లో నిరుద్యోగ సమస్యకు నిదర్శనం..!

2 Jan, 2023 06:58 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో నిరుద్యోగ సమస్యకు నిదర్శనమీ చిత్రం. 1,667 పోలీసు కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ కోసం రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ స్టేడియంలో రాత పరీక్ష జరిగింది. ఏకంగా 32,000 మంది అభ్యర్థులు తరలివచ్చారు. అప్పుల కారణంగా ఖర్చును భరించే పరిస్థితి లేక అధికారులు అందరినీ ఒకేచోటుకి పిలిపించి పరీక్ష నిర్వహించారు. పాకిస్తాన్‌ యువతలో 31 శాతం మంది నిరుద్యోగులే ఉన్నారు.

ఇస్లామాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 30వేల మంది పురుష, మహిళ అభ్యర్థులు స్టేడియంలో నేలపైనే కూర్చుని పరీక్ష రాశారు. గత ఐదేళ్లుగా సుమారు 1,667 పోస్టులు ఖాళీగా ఉండగా.. ఇటీవలే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. పోలీసు నియామక పరీక్షలకు సంబంధించిన చిత్రాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో దేశంలోని నిరుద్యోగ పరిస్థితిపై చర్చ మొదలైంది. దేశంలో నిరుద్యోగ సమస్య గరిష్ఠస్థాయికి చేరుకుంది. పాకిస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవెలప్‌మెంట్‌ ఎకనామిక్స్‌(పీఐడీఈ) ప్రకారం దేశంలో 31 శాతం మంది యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అందులో 51 శఆతం మంది మహిళలు, 16 శాతం మంది పురుషులు ప్రొఫెషనల్‌ డిగ్రీలు చేసి ఖాళీగా ఉన్నారు. పాకిస్థాన్‌ జనాభాలో 60 శాతం మంది 30 ఏళ్లలోపు వారే ఉండగా.. నిరుద్యోగ రేటు 6.9 శాతంగా ఉంది. 

ఇదీ చదవండి: ప్రమాదకరంగా పైపైకి

మరిన్ని వార్తలు