చేపా చేపా.. వాకింగ్‌కు వస్తావా?

15 May, 2022 02:28 IST|Sakshi

చాలా మందికి కుక్కలో, పిల్లులో, ఇతర పెంపుడు జంతువులో ఉంటాయి.. అప్పుడప్పుడూ వాటిని తీసుకుని అలా వాకింగ్‌కు వెళ్లొస్తుంటారు కూడా. మరి చేపలను పెంచుకునేవారి పరిస్థితి ఏమిటి? వాటిని ఎలా తీసుకెళ్లడం?.. తైవాన్‌కు చెందిన హువాంగ్‌ జెర్రీ అనే యూట్యూబర్‌కు ఇలాంటి సందేహమే వచ్చింది. అనుకున్నదే తడవుగా తాను పెంచుకుంటున్న గోల్డ్‌ ఫిష్‌లతో బయటికి వెళ్లే మార్గమేమిటా అని ఆలోచించాడు.

ఇదిగో ఈ చిత్రంలో కనిపిస్తున్న ‘వాకర్‌ ఫిష్‌ ట్యాంక్‌’ను తయారు చేసేశాడు. ఇదేదో అల్లాటప్పా ‘వాకర్‌ ఫిష్‌ట్యాంక్‌’ కాదు.. మంచి దృఢంగా ఉండే ఆక్రిలిక్‌ ఫైబర్‌ గాజు, గట్టి ఉక్కు మెటీరియల్‌తో రూపొందించాడు. చేపలకు ఆహారం వేసేందుకు ఏర్పాటు చేశాడు. ట్యాంకులోని నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసే చిన్నపాటి ఫిల్టర్‌ను.. నీటిలో ఆక్సిజన్‌ సరిగా ఉండేందుకు.. గాలిని పంపే ఎయిర్‌పంప్‌ను అమర్చాడు.

ఇవి నడిచేందుకు ఓ బ్యాటరీని అనుసంధానించాడు. ఇంకేం.. నీళ్లు మార్చాల్సిన అవసరం లేకుండానే.. ఎక్కడికైనా, ఎంతసేపైనా ‘ఫిష్‌’తో వాకింగ్‌కు వెళ్లొచ్చన్నమాట. హువాంగ్‌ ఇలా తన చేపలతో వాకింగ్‌కు వెళితే.. జనమంతా కళ్లప్పగించి చిత్రంగా చూశారట. ఇటీవల యూట్యూబ్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది. 

తినేందుకు వాడేస్తున్నారట.. 
ఇంతకుముందు జపాన్‌కు చెందిన ఎంఏ కార్పొరేషన్స్‌ చేసిన ‘పోర్టబుల్‌ ఫిష్‌ ట్యాంక్‌’ ఇది. ఎక్కడికైనా అలా చేతిలో పట్టుకుని వెళ్లిపోయేలా దీనిని రూపొందించారు. ట్యాంక్‌లోని నీళ్లలో ఆక్సిజన్‌ స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలించే ఏర్పాటూ ఉంది. అయితే దీన్ని చేపలు పెంచుకునేవారితోపాటు.. చేపలు, పీతలు వంటివి ఫ్రెష్‌గా తినాలనుకునేవారు వాటిని తెచ్చిపెట్టుకునేందుకు ఈ ట్యాంక్‌ను వాడేస్తున్నారట. 

మరిన్ని వార్తలు