వార్ని.. కోపంతో కోట్ల విలువైన కారునే కాల్చేశాడుగా..

28 Oct, 2020 15:42 IST|Sakshi

ఎక్కడికైనా వెళ్తుంటే దారిలో కారు కానీ, బైక్‌ కానీ ఆగిపోతే అక్కడే పడేసి వేరే వాళ్లని లిఫ్ట్‌ అడికి వెళ్తుండటం సినిమాల్లో చూస్తుంటాం. కారు చిన్న ట్రబుల్‌ ఇస్తే.. పెట్రోల్‌ పోసి తగలబెట్టినట్లు హాలివుడ్‌ సినిమాల్లో చూస్తుంటాం. అయితే అవి డమ్మీ కార్లు కాబట్టి ఎన్నింటిని తగలబెట్టినా పోయేదేమీ ఉండదు. కానీ ఓ యూట్యూబర్‌ మాత్రం కోపంతో ఏకంగా మెర్సిడెస్‌ కారునే తగులబెట్టాడు. అంతటితో ఆగకుండా ఆ తతంగాన్ని అంతా వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అయింది.

వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన మైఖేల్‌ లిట్విన్‌ ఓ యూ ట్యూబర్‌. సాహసాలు, ప్రాంక్ వీడియోలు చేస్తూ, ఆ వీడియోలను తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్టు చేస్తుంటాడు. ఆయన కొద్ది రోజుల క్రితం ఓ మెర్సిడెస్‌ కారును కొనుగోలు చేశాడు. అయితే.. ఆ కారు తరుచూ బ్రేక్‌డౌన్‌ అవుతూ ఇబ్బంది పెడుతోంది. ఆ సమస్య వచ్చినప్పుడల్లా కారును తనకు విక్రయించిన డీలర్ వద్దకు తీసుకెళ్తున్నాడు. ఇలా దాదపు ఐదుసార్లు తన కారును మెర్సిడెజ్‌ డీలర్‌ వద్దకు తీసుకెళ్లాడు. కానీ, సమస్యకు పరిష్కారం మాత్రం దొరలేదు. కంప్లైంట్ చేసిన ప్రతిసారి డీలర్‌ ఆ కారును రెండ్రోజుల పాటు సర్వీస్ సెంటర్‌లో ఉంచుకుంటున్నాడు. ఆ తర్వాత తిరిగి ఇచ్చేస్తున్నాడు. దానిని ఎన్నిసార్లు రిపేర్‌కు ఇచ్చినా.. సరిగా పనిచేయడం లేదు. దీంతో విసుగు చెందిన మైఖేల్‌..  రూ. 2.4 కోట్ల విలువైన తన కారును కాల్చేద్దామని డిసైడ్‌ అయ్యాడు.

ఆ కారును వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకెళ్లి దానిపై పెట్రోల్‌ పోశాడు. ఆ తర్వాత నేరుగా కొంత దూరం వరకు పెట్రోలు పోసుకుంటూ వెళ్లాడు. అనంతరం తన జేబులో నుంచి లైటర్‌ తీసి నిప్పుల కొలిమిని వెలిగించాడు. దానికి స్నాక్స్‌ని వేడి చేసుకొని తింటూ హీరో లెవల్లో వెనక్కి తిరిగి నిప్పు అంటించాడు. ఆ మంట నేరుగా వెళ్లి కారును టచ్‌ చేసింది. దీంతో ఖరీదైన కారు కాలి బూడిదైంది. ఆ దృశ్యాలన్నింటినీ లిట్విన్ విడియో తీసి తన యూట్యూబ్‌ చాలెన్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ప్రస్తుత ఆ వీడియో వైరల్‌ అయింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలీలో కామెంట్లు చేస్తున్నారు. ‘ఖరీదైన కారును ఎలా కాల్చేయాలనిపించింది?, అమెరికన్లు ఐఫోన్లను పగులగొడితే.. రష్యన్లు మెర్సిడెస్‌ కార్లనే కాల్చేస్తున్నారు’, ‘ ఈ వీడియోకు వచ్చిన ఆదాయంతో మరో రెండు మెర్సిడెస్‌ కార్లను కొనుక్కొవచ్చేలే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.      

మరిన్ని వార్తలు