యూట్యూబర్‌ తప్పుడు రివ్యూ.. రెస్టారెంట్‌ మూత

15 Jan, 2021 16:22 IST|Sakshi

సియోల్‌: తప్పుడు రివ్వూ ఇచ్చి రెస్టారెంట్‌ మూతపడటానికి కారణమైన ఓ యూట్యూబర్‌పై నెటిజన్‌లు మండిపడుతూ అతడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ కొరియాకు చెందిన హయన్ ట్రీ యూట్యూబ్‌లో ఫుడ్ బ్లాగ్‌ నడుపుతున్నాడు. దీనికోసం అతడు రెస్టారెంట్లు, హోటళ్లను సందర్శిస్తూ అక్కడి వంటకాలపై తన యూట్యూబ్ చానల్‌లో వీడియోలు పోస్టు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రెస్టారెంట్‌ను సందర్శించిన హయన్ ట్రీ తప్పుడు రివ్యూ ఇచ్చి ఆ రెస్టారెంటు మూసివేతకు కారణమయ్యాడు. వివరాలు.. డయగు అనే ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంటుకు హయాన్‌ ట్రీ వెళ్లి ఫుడ్‌ అర్డర్‌ ఇచ్చాడు. అయితే తన ప్లేటులో వడ్డించిన ఆహారపదార్థాల్లో అన్నం మెతుకులు కనిపించాయి. దీంతో ఇతర కస్టమర్లు తినగా మిగిలిన వాటిని మళ్లీ వడ్డిస్తున్నారని భావించాడు. దీంతో రెస్టారెంటు నిర్వహకులు కస్టమర్లను ఈ విధంగా మోసం చేస్తున్నారంటూ వీడియో పోస్టు చేసి నెగిటివ్‌ రివ్యూ ఇచ్చాడు. (చదవండి: టర్కీలో కరువు తాండవం.. 45 రోజుల్లో..)

అయితే అతడి చానల్‌కు 7లక్షలకు పైగా సబ్‌స్రైబర్స్‌ ఉన్నారు. దీంతో ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకరు తిన్న ఫుడ్‌ మళ్లీ సర్వ్‌ చేసి ఇలా కస్టమర్లను మోసం చేస్తున్నారా అని సదరు రెస్టారెంట్‌పై నెటిజన్‌లు మండిపడ్డారు. దీంతో ఈ వీడియో కాస్తా ఫుడ్‌ సెక్క్యూరిటీ అధికారుల కంటపడింది. ఇక వెంటనే అధికారులు స్పందిస్తూ ఆ రెస్టారెంట్‌పై దాడికి దిగారు. అక్కడి యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ రెస్టారెంట్‌ను మూసివేశారు. ఈ క్రమంలో రెస్టారెంట్‌ యాజమాన్యం హయాన్‌ ట్రీ వీడియో తప్పని తాము తాజా ఆహర పదార్థాలనే వడ్డిస్తున్నామని చెబుతూ వీడియో సాక్ష్యాన్ని చూపించినప్పటిక అధికారులు పట్టించుకోకుండా రెస్టారెంట్‌ను మూసివేశారు.
చదవండి: అమెరికా మా ప్రధాన శత్రువు: కిమ్‌ జాంగ్‌‌ ఉన్

అయితే ఈ సంఘటన గతంలో జరిగినప్పటికి ఇటీవల హయాన్‌ ట్రీ మళ్లీ ఆ రెస్టారెంటు వీడియోని వీక్షించగా అసలు విషయం బయటపడింది. ఆ పదార్థాలకు అంటుకున్న మెతుకులు అతడి ప్లేటులోనివేనని తెలిసి అతడు విస్తుపోయాడు. జరిగిన తప్పుకు తానే కారణం కావడంతో పశ్చాతాపం పడుతూ రెస్టారెంట్‌ యాజమాన్యాన్ని తాజాగా క్షమాపణలు కోరాడు. అంతేగాక తాను చేసిన తప్పిదాన్ని మన్నించాలని తను పెట్టిన వీడియోలో తప్పుడు సమాచారం ఇచ్చానంటూ మరో వీడియో పోస్టు చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. దీంతో అతడి సబ్‌స్రైబర్స్‌ అంతా తమని తప్పుదొవ పట్టించడమే కాకుండా.. రెస్టారెంట్‌ మూతకు కారణమయ్యావంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వెనకాముందు చూసుకొకుండా తప్పుడు వీడియో పోస్ట్‌ చేయడంతో వేల సంఖ్యలో సబ్‌స్రైబర్స్‌ ఆ చానల్‌ను అన్‌సబ్‌స్క్రైబ్‌ చేశారు.

మరిన్ని వార్తలు