అమెరికాలో తొలి ముస్లిం–అమెరికన్‌ జడ్జి

12 Jun, 2021 10:37 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక పాక్‌–అమెరికన్‌ వ్యక్తి ఫెడరల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. దీనికి సంబంధించిన ఓటింగ్‌కు అమెరికా సెనెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో అమెరికా మొట్టమొదటి ముస్లిం–అమెరికన్‌ ఫెడరల్‌ జడ్జిగా పాకిస్తాన్‌ సంతతికి చెందిన జాహిద్‌ ఖురేషీ (46) నియమితులయ్యారు. న్యూజెర్సీలోని జిల్లా కోర్టులో ఆయన విధులు నిర్వహించనున్నారు. 

కాగా, ఖురేషీ ఎంపికకు సంబంధించి సెనెట్‌  81–16 ఓట్లతో ఆమోదం తెలిపింది. ఈ ఓటింగ్‌లో దాదాపు 34 మంది రిపబ్లికన్లు డెమొక్రాట్లతో ఏకీభవించడం గమనార్హం. దీనిపై సెనెటర్‌ రాబర్ట్‌ మెనెండెజ్‌ స్పందిస్తూ.. జడ్జి ఖురేషీ దేశానికి సేవ చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నారని కొనియాడారు. ఆయన నియామకం ద్వారా అమెరికాలో ఏదైనా సాధ్యమే అని మరో సారి రుజువైందన్నారు. న్యూజెర్సీ కోర్టులో ఇప్పుడు వైవిధ్యం సాధ్యమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. 

కాగా, 2019లో ఖురేషీ న్యూజెర్సీలోని ఓ కోర్టుకు మేజిస్ట్రేట్‌గా ఎంపికయ్యారు. ఇక ఖురేషీ ఎంపికపై ఇస్లాం వర్గాలు హర్షం వ్యక్తం చేస్తుండగా, పాక్‌లో సంబురాలు చేసుకుంటున్నారు. 46 ఏళ్ల ఖురేషీ 2004, 2006లో ఇరాక్‌లో పర్యటించాడు. అంతేకాదు ఆయన తండ్రి కూడా గతంలో ప్రాసెక్యూటర్‌గా పని చేశాడు.

చదవండి: ట్రంప్‌ రీఎంట్రీ.. ఎలా సాధ్యమంటే..

మరిన్ని వార్తలు