రష్యా బలగాలు నాడు మా దాకా వచ్చాయి.. టైమ్‌ మ్యాగజైన్‌పై జెలెన్‌స్కీ

30 Apr, 2022 09:55 IST|Sakshi

ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీను పాశ్చాత్య దేశాలు హీరోగా అభివర్ణిస్తే.. కొన్ని దేశాల నుంచి మాత్రం విమర్శలతో ముంచెత్తాయి. అగ్రరాజ్యం అండ చూసుకుని.. అనవసరంగా ఉక్రెయిన్‌ను యుద్ధ ఊబిలోకి దించాడంటూ తిట్టిపోశారు కొందరు. అయినా జెలెన్‌స్కీ మాత్రం ఆ విమర్శలను పట్టించుకోవడం లేదు. పోరాటం వెనుక ప్రమేయాలు లేవని, దేశం నుంచి ఇంచు భూమి కూడా వదులుకోబోమని, కడదాకా పోరాడతామని అంటున్నాడు. 

తాజాగా ఆయన ముఖచిత్రంతో టైమ్‌ మ్యాగజైన్‌ ‘హౌ జెలెన్‌స్కీ లీడ్స్‌’ పేరుతో ఓ కవర్‌స్టోరీ ప్రచురించింది. రిపోర్టర్‌ సైమన్‌ షూస్టర్‌, అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ, ఆయన భార్య ఒలెనా జెలెన్‌స్కా, ఉక్రెయిన్‌ కీలక అధికారులను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా.. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఎదుర్కొంటున్న అనుభవాల్ని, మానసిక సంఘర్షణలను వివరించాడాయన. ‘‘ఆ ఉదయం నాకు బాగా గుర్తుంది. రష్యా బలగాల దుశ్చర్యతో.. పొద్దుపొద్దునే బాంబుల మోత మోగింది. నేను, నా భార్య ఒలెనా, 17 ఏళ్ల కూతురు, తొమ్మిదేళ్ల కొడుకు నిద్ర లేచాం. మా ఇద్దరు పిల్లలకు బాంబుల దాడి మొదలైందని చెప్పాం.

వెంటనే కొంతమంది అధికారులు మా దగ్గరికి వచ్చారు. కుటుంబంతో సహా సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని చెప్పారు. రష్యా బలగాలు ఏ క్షణమైనా కీవ్‌లో అడుగుపెట్టొచ్చని, కుటుంబంతో సహా తనను చంపే అవకాశాలు ఉన్నాయని వాళ్లు మమ్మల్ని హెచ్చరించారు. అధ్యక్ష భవనం నుంచి బయటకు చూస్తే.. విధ్వంసం, బాంబుల మోతే. సినిమాల్లో తప్ప అలాంటి దృశ్యాలేనాడూ చూడలేదు. అధ్యక్ష భవనం గేటు ముందు భారీగా సిబ్బంది మోహరించారు.

ఆ రాత్రంతా ఉక్రెయిన్‌ అధ్యక్ష భవనం ప్రాంగణంలో లైట్లు ఆర్పేశారు. నాకు, నా సిబ్బందికి బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ధరించమని ఇచ్చారు. ఏ క్షణం ఏ జరుగుతుందో అనే ఆందోళనతో అంతా ఉన్నారు. కానీ, ధైర్యం చెప్పా వాళ్లకు. రష్యా బలగాలు దాదాపుగా మా దగ్గరికి వచ్చేశాయి. కానీ, మా దళాలు గట్టిగానే ప్రతిఘటించాయి. అని జెలెన్‌స్కీ గుర్తు చేసుకున్నాడు. 

ఇక యుద్ధం తొలినాటి పరిస్థితులపై ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్‌ అనుభవజ్ఞుడైన ఒలెక్సీ అరెస్టోవిచ్ స్పందించాడు. ఆరోజు దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. జెలెన్‌స్కీ, ఆయన భార్యాపిల్లలు లోపల ఉండగానే రష్యన్ దళాలు రెండుసార్లు అధ్యక్ష భవనం ప్రాంగణంపై దాడి చేయడానికి ప్రయత్నించాయని పేర్కొన్నాడు.

చదవండి: తూర్పున దాడి ఉధృతం

మరిన్ని వార్తలు