అంతమంది చనిపోయారు.. రష్యాకు ఇంకేం ఇచ్చేది లేదు: జెలెన్‌స్కీ

12 Apr, 2022 19:27 IST|Sakshi

యుద్ధ పరిణామాలతో జరిగిన నష్టం గురించి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ రష్యాకు ఉక్రెయిన్‌ భూభాగాన్ని అప్పగించాల్సి వస్తే.. అని ఎదురైన ప్రశ్నకు జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించాడు. 

తాజాగా.. సీబీఎస్‌ న్యూస్‌ ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ మాట్లాడాడు. రష్యా ఆక్రమణలో.. ఉక్రెయిన్‌ భూభాగాల్ని అప్పగించే ప్రసక్తే లేదని స్పష్టత ఇచ్చాడు.‘‘మొత్తంగా మా దేశం నుంచి ఇంచు భూభాగాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేం. ఇప్పటికే ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. వాళ్ల శవాల మీద నుంచి రష్యా బలగాలు నడిచాయి. ఇంకేం ఇవ్వాలి వాళ్లకు. ఓపిక ఉన్నంత వరకు పోరాడుతాం. ఇది జీవితం.. ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు’’ అంటూ వ్యాఖ్యానించాడు. 

ఉక్రెయిన్‌ భూభాగం కోల్పోకూడదనే కదా పోరాటం జరుగుతోంది. మొదటి నుంచి ఆ అంశం మీదే ఉన్నాం.. పోరాడుతున్నాం. ఒకవేళ అవతలి పక్షానికి లొంగిపోయి ఉంటే.. యుద్ధమే ఉండేది కాదు కదా. ఏది ఏమైనా శాంతి స్థాపనకు సహేతుకమైన చర్చలకు తాము సిద్ధం అని ప్రకటించాడు జెలెన్‌స్కీ. 

ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి రష్యా మిలిటరీ చర్యలు.. పాశ్చాత్య దేశాల దృష్టిలో దురాక్రమణ మొదలైంది.  ఇప్పటికే 44 మిలియన్ల మంది ఉక్రెయిన్‌ను విడిచి వలసలు వెళ్లగా.. నగరాలు దిబ్బలుగా శిథిలమై మిగిలాయి. వేల మంది మృత్యువాత పడగా.. అందులో సాధారణ పౌరులే ఎక్కువగా ఉన్నారు.

మరిన్ని వార్తలు