రష్యా ‘విలీనం’ ప్రకటనతో.. ‘నాటో’వైపు ఉక్రెయిన్‌ చూపు

30 Sep, 2022 20:57 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లోని నాలుగు ఆక్రమిత ప్రాంతాలను తమ దేశంలో అధికారికంగా విలీనం చేసుకున్నట్లు ప్రకటించింది రష్యా. ఈ క్రమంలో మిలిటరీ కూటమి నాటోవైపు చూస్తోంది ఉక్రెయిన్‌. రష్యా ఆక్రమణల వేళ నాటో సభ్యత్వ ప్రక్రియను వేగవంతం చేయాలని పశ్చిమ దేశాలను కోరినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ తెలిపారు. ఈ మేరకు జెలెన్‌స్కీ మాట్లాడిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది అధ్యక్ష కార్యాలయం. 

‘ఇప్పటికే నాటో కూటమి ప్రమాణాలకు అనుకూలంగా ఉన్నామని మేము నిరూపించుకున్నాం. నాటోలో సభ్యత్వం వేగవంతం చేయాలని కోరుతూ చేసే దరఖాస్తుపై సంతకం చేస్తూ మేము నిర్ణయాత్మక అడుగు వేస్తున్నాం. వ్లాదిమిర్‌ పుతిన్‌ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రష్యాతో కీవ్‌ చర్చలు చేపట్టదు. కొత్త అధ్యక్షుడితోనే సంప్రదింపులు చేపడతాం.’ అని వీడియోలో మాట్లాడారు జెలెన్‌స్కీ. 

ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌, జపోరిజియా, లుహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. పుతిన్‌ ప్రకటన వచ్చిన కొద్ది సేపటికే జెలెన్‌స్కీ ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ఆక్రమిత ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా రష్యాలో చేరేందుకే ప్రజలు మొగ్గు చూపినట్లు అక్కడి నేతలు తెలిపారు. దీంతో ఉక్రెయిన్‌ ప్రాంతాలను అధికారికంగా తమలో విలీనం చేసుకుంది రష్యా.

ఇదీ చదవండి: రష్యా రక్తపిపాసి! ఉగ్రవాదులే ఇలా చేయగలరు: జెలెన్‌స్కీ

మరిన్ని వార్తలు