రష్యా రక్తపిపాసి! ఉగ్రవాదులే ఇలా చేయగలరు: జెలెన్‌స్కీ

30 Sep, 2022 18:13 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌పై అరివీర భయంకరంగా రష్యా బాంబు దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో ఉక్రెయిన్‌లో జపోరిజ్జియాలో సుమారు 25 మంది మరణించగా.. దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పెద్ద సంఖ్యలో బలగాల సమీకరణకు పిలుపునిచ్చిన కొద్దిరోజుల్లోనే రష్యా తన దాడులను వేగవంతం చేసింది. దీంతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఇలా ఉగ్రవాదులే చేయగలరని, రష్యా ఒక రక్తపిపాసి అని ఫైర్‌ అయ్యారు.

అంతేగాదు జీవితాన్ని కోల్పోయిన ప్రతి ఒక్క ఉక్రెయిన్‌కి మీరు సమాధానం చెప్పక తప్పదు అని హెచ్చరించారు. అదీగాక పుతిన్‌ డిక్రీ ద్వారా దక్షిణ ఉక్రెయిన్‌లో ఉన్న జపోరిజ్జియా, ఖైర్సన్‌ అనే రెండు ప్రాంతాల స్వాతంత్య్రాన్ని గుర్తించారు. దీంతో డొనెట్స్క్‌, లుగాన్స్క్‌లతో సహా మొత్తం నాలుగు ప్రాంతాలను రష్యా కలుపుకోవాలని చూస్తోంది. అంతేగాదు ఈ నాలుగు ప్రాంతాలు ప్రస్తుతం రష్యా నియంత్రణలోనే ఉన్నాయి.

అదీగాక రష్యా విలీనం చేసుకోవాలనుకున్న ప్రాంతాల్లో రష్యా స్థాపించిన నాయకులు గురువారం సమావేశమయ్యారు కూడా. రష్యా దళాలు ఉక్రెయిన్‌లో కొన్ని భూభాగాలను స్వాధీనం చేసుకున్నప్పుడూ పుతిన్‌ ఒక వేడకను కూడా నిర్వహిస్తారని సమాచారం. అలాగే జపోరిజ్జియాలోని మిగిలిని మూడు ప్రాంతాలను రష్యా విలీనం చేసుకుంటే గనుక అణ్వాయుధాలకు తెగబడుతుంది. ఎందుకంటే పుతిన్‌ అవసరమనుకుంటే అణ్యాయుధ దాడికి దిగుతామని బహిరంగంగానే ప్రకటించారు కూడా.

(చదవండి: ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు విలీనం.. రష్యా కీలక ప్రకటన)

మరిన్ని వార్తలు