ఉక్రెయిన్‌పై మళ్లీ నిప్పుల వాన

23 Mar, 2023 06:14 IST|Sakshi
జపొరిజాజియాలో రష్యా క్షిపణి దాడిలో మంటలంటుకున్న బహుళ అంతస్తుల భవనం

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం మళ్లీ విరుచుకుపడింది. బుధవారం ఉదయం తెల్లవారుజామున క్షిపణులు, డ్రోన్లతో సాధారణ నివాస ప్రాంతాలపై దాడికి దిగింది. ఉక్రెయిన్‌ నుంచి జపాన్‌ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా, రష్యా నుంచి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వెళ్లిపోయిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. జపొరిజాజియా నగరంలో తొమ్మిది అంతస్తుల అపార్టుమెంట్‌పై రష్యా మిస్సైల్‌ దాడి వీడియో దృశ్యాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

రాజధాని కీవ్‌ సమీపంలో విద్యార్థుల వసతి గృహంపై రష్యా సైన్యం దాడి చేయడంతో నలుగురు మృతిచెందారు. 20 మందికిపైగా గాయపడ్డారు. కీవ్‌కు దక్షిణాన ఉన్న రిజీసిచివ్‌ సిటీలో ఓ ఉన్నత పాఠశాల, రెండు డార్మిటరీలు సైతం పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఓ డార్మిటరీ ఐదో అంతస్తు నుంచి 40  ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని వెలికితీశారు. మొత్తం ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు.

రష్యా 21 డ్రోన్లను ప్రయోగించగా, అందులో తాము 16 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్‌ సైనిక వర్గాలు వెల్లడించాయి. రష్యా ఒకవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు భీకర దాడులకు ఆదేశాలకు జారీ చేస్తోందని జెలెన్‌స్కీ మండిపడ్డారు. పౌరుల నివసాలపై రష్యా క్షిపణి దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ రష్యాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని బుధవారం స్వదేశానికి తిరిగివచ్చారు. జపాన్‌ ప్రధాని కిషిదా ఉక్రెయిన్‌ నుంచి పోలాండ్‌కు చేరుకున్నారు.   
 

మరిన్ని వార్తలు