చారిత్రక ఘట్టం: ఈయూ సభ్యత్వ దరఖాస్తుపై సంతకం చేసిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

1 Mar, 2022 10:06 IST|Sakshi

President Volodymyr Zelenskyy Signed The Application: గత కొన్ని రోజులుగా రష్యా ఉక్రెయిన్‌ల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అధ్యక్షుల మధ్య జరిగిన తాజా చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఎవరికివారు తమదైన శైలిలో యుద్ధ వ్యూహాలతో సాగిపోతున్నారు. ఆ తదుపరి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్స్కీ యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లో వెంటనే సభ్యత్వం ఇవ్వాలని అభ్యర్థించిన సంగతి కూడా తెలిసిందే.

ఈ మేరకు జెలెన్స్కీ యుద్ధంలో దెబ్బతిన్న తమ దేశం కోసం వెంటనే ప్రత్యేక విధానంలో యూరోపియన్ యూనియన్ సభ్యత్వం పొందేందుకు అనుమతించమని కోరుతూ దరఖాస్తుపై సంతకం కూడా చేశారు. ప్రధాన మంత్రి డెనిస్ ష్మిహాల్, ఉక్రెయిన్ ఏకసభ్య పార్లమెంట్ ఛైర్మన్ రుస్లాన్ స్టెఫాన్‌చుక్ సమక్షంలో ఈ దరఖాస్తు పై సంతకం చేశారు. దీనిపై రాష్ట్రపతి సంతకం కూడా ఉంది.

ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ .."ఇది ఉక్రెయిన్‌ ప్రజల హక్కు దీనికి మేము అర్హులం" అని ట్యాగ్‌ని జోడించి మరీ పోస్ట్‌ చేశారు. మరోవైపు ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడినందుకు గానూ రష్యాని ప్రపంచ దేశాలు దౌత్య పరంగా ఆర్థిక పరమైన విషయంలో ఏకాకిని చేసింది. అంతేకాదు బెల్జియం, ఫిన్లాండ్, కెనడా తమ గగనతలం నుంచి రష్యన్ విమానాలను నిషేధించిన ఇతర దేశాల జాబితాలో చేరాయి. 

(చదవండి: రష్యా బలగాలు విఫలం?..అందుకే బెలారస్‌ దిగనుందా?)

మరిన్ని వార్తలు