Zero Discrimination Day 2022: సీతాకోక చిలుకనే ఎందుకు ఎంచుకున్నారు?

1 Mar, 2022 13:48 IST|Sakshi

Zero Discrimination Day 2022: Theme, history, significance జీవిత చక్రంలో భాగంగా గొంగళి పురుగు పూర్తిగా సీతాకోక చిలుకగా మారుతుంది. ఆ మారడంలో ఎంతో బాధను ఓర్చుకుని.. రంగు రంగుల రెక్కలతో పైకి ఎగురుతుంది. బతికేది కొంతకాలమే అయినా.. ఏ బాధాబందీ లేకుండా స్వేచ్ఛగా జీవిస్తుంది సీతాకోకచిలుక. అందుకేనేమో వివక్ష వ్యతిరేక దినోత్సవం కోసం సీతాకోక చిలుకనే ఎంచుకున్నారు. 


ప్రతీ ఏడాది మార్చి 1వ తేదీన జీరో డిస్క్రిమినేషన్ డే. కుల, మత, వర్గ, లింగ, జాతి, ఆర్థిక అసమానతలనే బేధాలతో సంబంధం లేకుండా మనిషికి ఎదురయ్యే ‘వివక్ష’ను వ్యతిరేకించే రోజు.  ఐక్యరాజ్య సమితి, దాని అనుబంధ విభాగాలన్నీ ఈ తేదీని నిర్వహించుకుంటాయి. 

► UNAIDS(హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌ మీద ఐరాస చేపట్టిన సంయుక్త కార్యక్రమం) ప్రకారం.. హాని కలిగించే చట్టాలను తొలగించాలి. సాధికారత కల్పించే చట్టాలను రూపొందించాలి అనే థీమ్‌తో ఈ ఏడాది వివక్ష(శూన్య) వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నారు. వివక్షాపూరిత చట్టాలకు వ్యతిరేకంగా తీసుకోవాల్సిన తక్షణ చర్యల అవసరాన్ని తెలియజేస్తుంది ఈ శక్తివంతమైన థీమ్‌. 

► పని ప్రదేశంలో వివక్షను ఖండించే పోరాటంగా మొదలై..  2013 డిసెంబర్‌లో ఒక భారీ ఉద్యమంగా మారింది. బీజింగ్‌లో ఒక మెగా ఈవెంట్‌ ద్వారా 30 పెద్ద కంపెనీల ప్రతినిధులు వివక్ష నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. అక్కడి నుంచి ఈ ఉద్యమం.. ప్రపంచం మొత్తం విస్తరించి ఐక్యరాజ్య సమితికి చేరింది. 

► జీరో డిస్క్రిమినేషన్ డేను మొట్టమొదటగా.. మార్చి 1, 2014న నిర్వహించింది HIV/AIDS. హెచ్‌ఐవీ రోగులపై వ్యవస్థీకృత, సాంస్కృతిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడేందుకు థీమ్‌తో ప్రారంభించింది.

► జీరో డిస్క్రిమినేషన్ డే.. సింబల్‌ సీతాకోక చిలుక. ఇది చూసి చాలామంది మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం కోసమే సీతాకోక చిలుకను ఎంపిక చేశారనుకుంటారు. కానీ, ఇదీ వివక్షే అవుతుంది కదా అంటోది అన్‌ఎయిడ్స్‌.  సీతాకోక చిలుక కేవలం ఆడవాళ్లకే కాదని.. అందరికీ వర్తిస్తుందని, కేవలం స్వేచ్ఛా కోణంలో మాత్రమే సీతాకోకచిలుకను చిహ్నంగా ఎంచుకున్నట్లు ఒక ప్రకటనలో ఆమధ్య పేర్కొంది. 

► కొన్ని దేశాల్లో చట్టాల్లోని లొసుగులు.. న్యాయాన్ని దూరం చేస్తున్నాయి. పక్షపాత చట్టాలపై పోరాటాన్ని తెలియజేసేలా అవగాహన కల్పిస్తారు జీరో డిస్క్రిమినేషన్ డే నాడు.

► జీరో డిస్క్రిమినేషన్ డే.. ఇవాళ సోషల్‌ మీడియాలో సీతాకోక చిలుకల ఫొటోలతో అవగాహన, అనుభవాలు, జ్ఞాపకాలు.. ఇలా ఏవైనా పంచుకోవచ్చు. 


::: సాక్షి, వెబ్‌స్పెషల్‌

whatsapp channel

మరిన్ని వార్తలు