Zombie Virus: గడ్డకట్టే మంచులో జాంబీ వైరస్‌ల జాడ!.. ప్రభావం ఏమేర ఉంటుందో?

29 Nov, 2022 18:38 IST|Sakshi

గ్లోబల్‌ వార్మింగ్‌తో మానవాళికి ముమ్మాటికీ ముప్పే!. అతిశీతోష్ణ స్థితి ప్రాంతాల్లో.. వాతావరణ మార్పుల ప్రభావం పెను ముప్పుకు దారి తీయొచ్చని శాస్త్రవేత్తలు గత కొన్నేళ్లుగా హెచ్చరిస్తూ వస్తున్నారు. వాతావరణం వేడెక్కడం వల్ల మంచు కరిగిపోవడం.. అందులో అప్పటికే చిక్కుకున్న మీథేన్ వంటి గ్రీన్‌హౌజ్‌ వాయువులు విడుదల కావడం, తద్వారా పరిస్థితి మరింత దిగజారుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే.. 

గడ్డ కట్టుకుపోయే స్థితిలో ఉన్న మంచులో సైతం.. ప్రమాదకరమైన వైరస్‌ల ఉనికి ఉంటుందని, ఒకవేళ ఇవి గనుక విజృంభిస్తే .. మానవాళికి ముప్పు ఊహించని రీతిలో ఉండొచ్చని తాజాగా సైంటిస్టులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనాతో ప్రపంచ మానవాళి ఎంత ఇబ్బంది పడిందో కళ్లారా చూశాం. అలాగే.. కనుమరుగు అయ్యాయనుకునే వైరస్‌ల జాడ.. మంచు ప్రాంతాల్లో  సజీవంగా తరచూ బయటపడుతుంటుంది కూడా. కానీ, వాటి ప్రభావం ప్రపంచంపై ఏమేర ఉంటుందనే దానిపై ఓ స్పష్టత అంటూ లేకుండా పోయింది. 

తాజాగా.. రష్యాలోని సైబీరియా రీజియన్‌లో సుమారు 48 వేల సంవత్సరాల వయసున్న వైరస్‌ల ఉనికిని.. గడ్డకట్టుకుపోయిన ఓ సరస్సు అడుగు భాగం సేకరించారు యూరోపియన్‌ సైంటిస్టులు. మంచు ప్రాంతాల్లో తమ పరిశోధనల్లో భాగంగా..  మొత్తం పదమూడు రకాల వ్యాధికారకాలను గుర్తించి.. ‘జాంబీ వైరస్‌’లుగా వాటిని వ్యవహరిస్తున్నారు. అయితే ఆశ్చర్యంగా.. ఇంతకాలం గడ్డకట్టిన స్థితిలో ఉన్నా కూడా అంటువ్యాధులు ప్రబళించే సామర్థ్యంతో అవి ఉన్నట్లు చెప్తున్నారు. 

రష్యా, జర్మనీ, ఫ్రాన్స్‌కు చెందిన సైంటిస్టులు ఈ వైరస్‌లు తిరిగి విజృంభిస్తే.. ఏమేర ప్రభావం చూపుతాయి అనే అంశంపై పరిశోధనలు ముమ్మరం చేశారు. వీటి వయసు ఎంత? అంటువ్యాధులను ఎలా వ్యాప్తి చెందిస్తాయి? బయటకు వచ్చాక వాటి ప్రభావం ఎలా ఉంటుంది?.. మనిషి/జంతువుల్లో వాటి ప్రభావం ఏమేర ఉంటుంది?.. తదితర అంశాలపై ఇప్పుడే ఓ అంచనాకి రాలేమని, మరికొంత సమయం పడుతుందని రీసెర్చర్లు చెప్తున్నారు.

ఇదీ చదవండి: మంకీపాక్స్ పేరు మారింది!

మరిన్ని వార్తలు