గంటల్లోనే 4.2 బిలియన్ డాలర్లు"జూమ్"

1 Sep, 2020 19:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కాలంలో టెక్ ప్రపంచంలో అత్యంత ధనవంతుల ఆదాయం జామ్ జామ్ అంటూ రికార్డు స్థాయిలో పరుగులు పెడుతోంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్  ఒక రోజులో నికర విలువ13 బిలియన్ డాలర్లు పెరగ్గా, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్  ఆదాయం గత నెల 24 గంటల్లో 8 బిలియన్లు పెరిగింది. తాజాగా  రికార్డు ఆదాయం సాధించినవారి జాబితాలో ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎరిక్ యువాన్ చేరారు. (ప్రపంచ ధనవంతుల జాబితా.. 4వ స్థానంలో ఎలన్‌)
 
ఆగస్టు 31న ప్రకటించిన జూలై 31తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో జూమ్ ఆదాయం 355 శాతం పెరిగి 663.5 మిలియన్ డాలర్లకు చేరుకుంది. కేవలం ఒక సంవత్సరంలో ఆదాయం దాదాపు నాలుగు రెట్లు పెరుగుదలను నమోదు చేసింది. దీంతో కంపెనీ షేర్లు  26 శాతం ఎగిసాయి. ఎరిక్ యువాన్ కొద్ది గంటల్లోనే వందల కోట్ల డాలర్లను తన సంపదకు జోడించుకున్నారు. ఫలితంగా అతని సంపద 4.2 బిలియన్ డాలర్ల మేర  పెరిగిందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. జూమ్ వీడియో పేరు ఇదే జోరు కొనసాగిస్తే యువాన్  సంపద 20 బిలియన్ డాలర్లకు మించిపోతుందని  పేర్కొంది.

కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభ సమయం, లాక్ డౌన్ నిబంధనల కారణంగా ప్రజలు వర్చువల్ జీవితానికి అలవాటు పడాల్సిన పరిస్థితి. దీంతో వీడియోకాలింగ్ యాప్ కు భారీ ఆదరణ లభించింది.  దీంతో ఈ త్రైమాసికంలో యువాన్ ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగింది. సుమారు 50 మిలియన షేర్లతో కంపెనీలో దాదాపు 29 శాతం వాటా యువాన్ సొంతం. ఏప్రిల్ 2019లో పబ్లిక్ ఆఫర్ నాటికి ఇది 22 శాతంగా ఉంది. కాగా  ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం యువాన్  నికర విలువ 14.4 బిలియన్ల డాలర్లు.

మరిన్ని వార్తలు