పోలీస్‌ అధికారిపై దాడి కేసులో ఒకరికి జైలు

16 Nov, 2023 06:18 IST|Sakshi

సిరిసిల్లక్రైం: పోలీస్‌ అధికారిపై దాడి చేసి విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఒకరికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 వేలు జరిమానా విధిస్తూ సిరిసిల్ల న్యాయమూర్తి ప్రవీణ్‌ బుధవారం తీర్పు వెల్లడించారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం 2013 జూలై 28న సిరిసిల్ల పట్టణం విద్యానగర్‌లో తబ్లిక్‌ జమాత్‌, సున్నీ జమాత్‌కు చెందిన ముస్లింలు రెండుగా విడిపోయి గొడవ చేసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అప్పటి సీఐ ప్రస్తుత డీఎస్పీ నాగేంద్రచారి తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి వెళ్లి ఆపేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో సిరిసిల్లకు చెందిన మహ్మద్‌ తాజ్‌ సీఐపైకి రాయి విసరడంతో చేతికి గాయమైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దాడికి కారణమైన తాజ్‌ను రిమాండ్‌కు తరలించి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ప్రవీణ్‌ బుధవారం తీర్పును వెల్ల డిస్తూ మహ్మద్‌ తాజ్‌కు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 2 వేల జరిమానా విధించారు. శాంతిభద్రతల రక్షణలో అనునిత్యం పని చేసే పోలీస్‌ అధికారులు, సిబ్బందిపై దాడులకు దిగిన, విధులకు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ హెచ్చరించారు.

చోరీ కేసులో ఇద్దరికి..

ఆలయాల్లో దొంగతనం చేసిన కేసులో ఇరువురికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల న్యాయమూర్తి ప్రవీణ్‌ బుధవారం తీర్పు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే 2023 జూన్‌ 29న రగుడు ఎల్లమ్మ ఆలయం, సిరిసిల్ల విశ్వనాథ ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో చోరీ చేశారని ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించి మైలారం ఆశారాములు, బాల నర్సింహులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణ అధికారి బీసీ నాయక్‌ కోర్టులో చార్జిషీటు దాఖలు చేయగా ఎస్సై లావుడ్య శ్రీకాంత్‌, కానిస్టేబుల్‌ నరేశ్‌లు సాక్ష్యాలు ప్రవేశపెట్టడంతో పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి నిందితులు ఆశారాములు, నర్సింహులకు ఏడాది జైలు విక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

మరిన్ని వార్తలు