మహిళా చైతన్యం ఎవరికి లాభమో..

3 Dec, 2023 00:52 IST|Sakshi
పెగడపల్లిలో పోలింగ్‌ కేంద్రం వద్ద మహిళలు

పెగడపల్లి/కథలాపూర్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ధర్మపురి నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళల ఓట్లే ఎక్కువగా పోలయ్యాయి. ఇది ఎవరికి కలిసిరానుందనే అంచనాల్లో నేతలు నిమగ్నమయ్యారు. నియోజకవర్గంలో 2,26,880 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,11,172 మంది, మహిళలు 1,15,702 మంది మహిళలు, ఇతరులు 6గురు ఉన్నారు. ఎన్నికల్లో 83,567 మంది పురుషులు, 95,704 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. ఈ లెక్కన 12,137మంది మహిళలు ఎక్కువగా ఓటేశారు. మహిళల పోలింగ్‌ శాతం పెరగడం తమకే లాభం చేకూరుస్తుందని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోల్లో మహిళలకు అందించే పథకాలను విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో వారు తమకే మొగ్గుచూపారని నాయకులు చెబుతున్నారు.

ప్రచారంలోనూ మహిళలే భళా..

కథలాపూర్‌ మండలంలో 19 గ్రామాల్లో మహిళల ఓ ట్లే అధికంగా ఉన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు ఓటముల్లో వీరి ఓట్లే కీలకం. ఇందుకు తగ్గట్టుగానే అభ్యర్థులు తమ ప్రచారంలో మహిళలకు పెద్దపీట వేశారు. ఏ రాజకీయపార్టీ అభ్యర్థి ప్రచారం చేసినా మహిళలే అధికంగా హాజరయ్యారు. పోలింగ్‌లోనూ వీరే అధికంగా ఓటేశారు. 19 గ్రామాల్లో 36,012 మంది ఓటర్లున్నారు. మహిళలు 18,992 మంది ఉన్నారు. మహిళలు 16,012 మంది ఓట్లు వేశారు. దీంతో అభ్యర్థుల గెలుపోటముల్లో మహిళల ఓట్లే కీలకం కానున్నాయని రాజకీయ నాయకులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు