‘ఎలక్షన్‌ ఫండ్‌’లో ఎస్సైలు!

8 Jan, 2024 12:23 IST|Sakshi

ఎక్కడెక్కడ.. ఎవరెవరు.. ఎవరెవరికి.. ఎంతెంత ?

తీగ లాగితే కదులుతున్న డొంక..

ఇంటెలిజెన్స్‌ విచారణలో వెలుగుచూస్తున్న వాస్తవాలు

త్వరలోనే ‘ఫండ్‌’ ఇచ్చిన వారిపై ఉన్నతాధికారులకు నివేదిక

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మళ్లీ గెలుస్తారనే ధీమానే కారణం

ఒక్కొక్కరుగా బయట పడుతున్న వైనం

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ‘తీగలాగితే డొంక కదిలిన’ చందంగా ‘ఎన్నికల ఫండ్‌’ ఇచ్చిన పోలీస్‌ అధికారుల గుట్టు రట్టు అవుతోంది. అసెంబ్లీ ఎన్ని కల సందర్భంగా అప్పటి వరకున్న ప్రజాప్రతినిధులకు కొందరు సీఐలు, ఒక్కరిద్దరు ఏసీపీలు మా త్రమే ‘ఎన్నికల ఫండ్‌’ ఇచ్చారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఫిర్యాదులు కొన్నిచోట్ల నేరుగా కొందరు ఎమ్మెల్యేల నుంచే అందడంతో సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఓ వైపు ఇంటెలిజెన్స్‌.. మరోవైపు స్పెషల్‌ బ్రాంచ్‌ ఆరా తీస్తుండగా.. ఫండ్‌ ఇచ్చిన కొందరు ఎస్సైల పేర్లు కూడా వెలుగుచూస్తున్నట్లు సమాచారం.

బాధ్యులపై త్వరలోనే నివేదిక..
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటివరకున్న కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎన్నికల ఫండ్‌ ఇచ్చిన పోలీస్‌ అధికారులపై చర్యలకు నివేదికలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ అధికారవర్గాల్లో ఈ అంశం హాట్‌ టాఫిక్‌ గా మారింది. ఎన్నికల సందర్భంగా అప్పుడున్న సర్వేలు, ప్రచారం ఆధారంగా ఎలాగైనా మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న ధీమా ఒకవైపు.. మరోవైపు పైరవీలు, ఎమ్మెల్యేల లెటర్లతో కీలక పోస్టింగులు పొందిన వారు ఏడాదిలోపే వచ్చిన ఎన్నికల తర్వాత సైతం కొనసాగాలని ఆశపడ్డారు.

అయితే, మళ్లీ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన కొందరు అభ్యర్థులకు కొంతమంది ఇన్‌స్పెక్టర్లు, ఒక్కరిద్దరు ఏసీపీలు రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ‘ఎలక్షన్‌ ఫండ్‌’ సమకూర్చిన వైనంపై పోలీస్‌ అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత ఊ హించని రీతిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విషయం బయటకు పొక్కింది. సొంతశాఖ వారే ఈ వ్యవహారాన్ని భూతద్దంలో పెట్టగా ఈనోట ఆనోటా కొత్తగా గెలిచిన కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు చేరింది. ఎన్నికల సమయంలో ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా.. ‘ఫండ్‌’ సమకూర్చిన సదరు అధికారులపై చర్యలకు పట్టుబడుతుండడం చర్చనీయాంశం అవుతోంది.

పోలీసు గ్రూపుల్లో ‘సాక్షి కథనం’ వైరల్‌
‘ఎమ్మెల్యే అభ్యర్థులకు పోలీసుల ఫండ్‌’ శీర్షికన ఈనెల 5న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై పోలీసువర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వరంగల్‌ కమిషనరేట్‌, ఉమ్మడి వరంగల్‌తోపాటు పొరుగు జిల్లాల పోలీసు గ్రూపుల్లో ‘సాక్షి’ కథనం వైరల్‌ అవుతోంది. ‘ఎస్‌హెచ్‌ఓలుగా ఉన్న ఇన్‌స్పెక్టర్లు, ఏసీపీలే కాదు.. ఎస్సై లు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫండ్‌ ఇచ్చారు’ అంటూ పోలీస్‌ గ్రూపుల్లో కామెంట్‌ జరుగుతోంది. ఎక్కడెక్కడ.. ఎవరెవరు.. ఎవరెవరికి.. ఎంతెంత మొత్తంలో నిధులు సమకుర్చారన్న అంశాలపై కూడా పోలేసువర్గాల్లో చిట్‌ చాట్‌ జరుగుతోంది. ఆరోపణలు ఎదుర్కుంటున్న వారు, ‘ఫండ్‌’ వ్యవహారంతో సంబంధం లేనివారు తమ సహచరులు, సన్నిహితులతో ఒకరిపై ఒకరు పరోక్ష వ్యాఖ్యలు చేసుకుంటుండడం కూడా దుమారం రేపుతోంది.

ఇవి చ‌ద‌వండి: ప్రమోషన్లకు ఆటంకంగా 'టెట్‌' అలజడి!

>
మరిన్ని వార్తలు