రోగులకు భరోసా

9 Mar, 2023 04:12 IST|Sakshi

గద్వాల క్రైం: కిడ్నీలు చెడిపోయాయంటే జీవితకాలాన్ని పొడిగించుకోవడానికి డయాలసిస్‌ ఒక్కటే మార్గం. కొందరు వారంలో రెండుసార్లు, మరికొందరు మూడుసార్లు డయాలసిస్‌ తప్పనిసరిగా చేయించుకోవాలి. తాజాగా జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్‌ సేవలు ప్రారంభించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వైద్యం.. మందులు, తాజాగా పింఛన్‌ అందజేస్తుండడంతో వారికి, వారి కుటుంబానికి భరోసానిస్తోంది. రోగుల సంఖ్య మేరకు నిత్యం ఐదు విడతలుగా సిబ్బంది సేవలు అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 124 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రక్తశుద్ది సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న డీమెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో వారికి సేవలు అందిస్తున్నారు.

నిత్యం ఐదు విడతలుగా..

కీడ్ని వ్యాధిగ్రస్తులకు ప్రతి రోజు ఐదు విడతలుగా సిబ్బంది విధులు నిర్వహిస్తూ.. సేవలందిస్తున్నారు. ప్రతి రోగికి నాలుగు గంటల పాటు రక్తశుద్ది చేస్తున్నారు. వ్యాధిగ్రస్తులు వారంలో మూడు రోజులు కేటాయించిన సమయంలో ప్రభుత్వాసుపత్రికి చేరుకుంటున్నారు. అవసరమైయ్యే మందులు, ఇంజెక్షన్లు, రక్త పరీక్షలు చేపట్టి వారి ఆరోగ్య స్థితిగతులపై కుటుంబ సభ్యులకు వివరిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఉచిత బస్సు పాసు సౌకర్యం కల్పించింది. ఇదిలాఉండగా, గతంలో జిల్లాలోని వ్యాధి గ్రస్తులు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుతో జిల్లా ఆస్పత్రిలోనే డయాలసిస్‌ సేవలు ప్రారంభించింది. దీంతో జిల్లాలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఎంతో ఊరట కలిగింది. డయాలిస్‌ విభాగంలో ఒక క్లినికల్‌ మేనేజర్‌, ఇద్దరు డేటా ఆపరేటర్స్‌, 12 మంది టెక్నీషియన్లు, ఇద్దరు నర్సులు, ఒక వార్డుబాయి విధులు నిర్వహిస్తున్నారు.

వేధిస్తున్న సమస్యలు

జిల్లా ఆస్పత్రిలోని డయాలసిస్‌ విభాగంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను సమస్యలు వేధిస్తున్నాయి. ఆస్పత్రి పైఅంతుస్తులో రక్తశుద్ధి విభాగం ఉండడం, అక్కడికి వేళ్లేందుకు వీల్‌చైర్ల కొరత, వెయింటింగ్‌ సమయంలో మౌలిక వసతులు లేక వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంధువుల సహాయంతో పైఅంతస్తుకి ఇబ్బందుల నడుమ చేరుకోవాల్సి వస్తోంది. వైద్యం అందించే క్రమంలో ఆర్‌ఓ ప్లాంట్‌ ద్వారా శుద్ధనీరు ఎంతో ముఖ్యం కాగా విద్యుత్‌ అంతరాయం ఏర్పడిన క్రమంలో ఆర్‌ఓ ప్లాంట్‌కు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి ఆగిపోతుంది. ప్రత్యేక జనరేటర్‌ ఏర్పాటు చేయడంతోపాటు డయాలసిస్‌ విభాగాన్ని ఆస్పత్రి కింది ఫ్లోర్‌లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.

కిడ్నీ వ్యాధిగ్రస్తులకునిత్యం ఐదు విడతలుగా సేవలు

ఉచితంగా మందులు.. ఇంజెక్షన్లు

జిల్లా ఆస్పత్రిలో సేవలు ప్రారంభించడంతో తీరిన రాకపోకల ఇక్కట్లు

ప్రత్యేక విభాగం కేటాయిస్తేమరింత ఊరట

మరిన్ని వార్తలు