రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం

9 Mar, 2023 04:12 IST|Sakshi
మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, చిత్రంలో డీకే అరుణ, జితేందర్‌రెడ్డి

పాలమూరు: నాలుగున్నర కోట్ల ప్రజల భవిష్యత్‌కు సంబంధించిన అంశాలకు సంబంధించి రాష్ట్ర మంత్రి మండలి సమావేశాల్లో కాకుండా ప్రగతిభవన్‌ డైనింగ్‌ టేబుల్‌పై నిర్ణయాలు జరుగుతున్నాయని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇదే పాలన భవిష్యత్‌లో ఉంటే రాష్ట్రంలో సామాన్యులు బతకలేరని అన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంతో పాటు సుదర్శన్‌గార్డెన్స్‌లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రగతిభవన్‌లోకి ఎంఐఎం నాయకుల మోటార్‌ సైకిళ్లు వెళ్లినా.. డోర్లు వెంటవెంటనే తెరుచుకుంటాయని, ఇతరులకే కనీసం అపాయిట్‌మెంట్‌ కూడా దొరకదన్నారు. అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన వైఫల్యాలను, చేతగానితనాన్ని, అవినీతి కార్యక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి అనేక నాటకాలకు తెర తీసిందని..అందులో భాగంగానే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్పుచేశారని విమర్శించారు. దేశానికి ఆదర్శంగా ఉంటామని చెబుతున్న ఈ బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన 12 మంది ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ, వైఎస్సార్‌సీపీ వారిని పార్టీలో ఎందుకు కలుపుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఇసుక, లిక్కర్‌ మాఫియా శాసిస్తోందని, ధరణి అధర్మంగా మారిందని, ఎన్నికలు పూర్తిగా కలుషితం చేశారని ఆరోపించారు.

ప్రశ్నించే అభ్యర్థిని గెలిపించండి

శాసనమండలి సమావేశాల్లో 9 ఏళ్లుగా ఉపాధ్యాయుల సమస్యలపై ప్రశ్నించే పరిస్థితి లేకుండాపోయిందని, అసలు ప్రతిపక్షం లేకుండా కుట్రలు చేసి పార్టీలోకి కలుపుకోవడం ఏమిటని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు నేడు ఆత్మగౌరవంగా బతుకుతున్నారా అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయులంటే సమాజాన్ని జాగ్రత్తపరిచే వ్యక్తులని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. అలాంటి వారి అస్తిత్వమే లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్వపరిచిందన్నారు. నెలనెలా జీతం సమయానికి వస్తుందో లేదో అని ఆత్రుతతో ఎదురుచూసే దీనస్థితిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏబీఎన్‌ రెడ్డికి మద్దతు పలికి ఉపాధ్యాయ సమస్యలపై శాసనమండలిలో గళం వినిపించే విధంగా చేయాలని కోరారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తీసుకునే నిర్ణయం తెలంగాణ సమాజానికి మేలు కోరే విధంగా ఉండాలని ఆమె సూచించారు. సమావేశాల్లో జాతీయ కార్యవర్గసభ్యులు ఏపీ జితేందర్‌ రెడ్డి, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్‌, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్‌, నాయకులు ఎగ్గని నర్సింహులు, పద్మజారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, అశ్వత్థామారెడ్డి, ఎన్‌పీ వెంకటేష్‌, శ్రీవర్ధన్‌రెడ్డి, కృష్ణవర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే సామాన్యులు బతకలేరు

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

మరిన్ని వార్తలు