విద్యార్థినుల సమస్యల పరిష్కారానికి కృషి

10 Mar, 2023 02:46 IST|Sakshi
పుల్లూరు గురుకుల పాఠశాల వద్ద మిషన్‌భగీరథ నీటిని పట్టుకుంటున్న విద్యార్థినులు

ఉండవెల్లి: పుల్లూరు గురుకుల పాఠశాల విద్యార్థినుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని, ఆయా సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని సీడబ్ల్యూసీ చైర్మన్‌ సహదేవుడు అన్నారు. మండలంలోని పుల్లూరు గురుకుల పాఠశాల విద్యార్థినుల సమస్యలపై ‘సాక్షి’లో ‘మా బాధలు పట్టవా’ అనే శీర్షికన కథనం ప్రచురితమవగా.. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సీడబ్ల్యూసీ చైర్మన్‌, బృందం గురువారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. నీటి సమస్య పరిష్కరించాలని, మిషన్‌ భగీరథ నీటి కోసం మినీ ట్యాంకు, పాఠశాల ఆవరణలో విద్యుత్‌ బల్బులు ఏర్పాటుచేయాలని, రాత్రి వేళల్లో రక్షణ కల్పించాలని విద్యార్థినులు కోరగా.. సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

ఎట్టకేలకు పాఠశాలకు మిషన్‌ భగీరథ నీరు

పుల్లూరు గురుకుల పాఠశాలకు ఎట్టకేలకు మిషన్‌ భగీరథ నీరు సరఫరా అయ్యాయి. నీరు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసి జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టారు. ఈమేరకు గురువారం పుల్లూరులోని కల్వర్టు మీదుగా మిషన్‌ భగీరథ నీటిని పాఠశాలకు సరఫరా చేశారు. ఈక్రమంలో మినీ ట్యాంకు ఏర్పాటు చేసేలా చూడాలని, లేదంటే నీరు వృథాగా పారుతాయని మిషన్‌ భగీరథ అధికారులను ప్రిన్సిపాల్‌ దేవానందం కోరారు. ఇదే విషయమై మిషన్‌ భగీరథ ఎస్‌ఈ జగన్‌మోహన్‌ను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా.. పాఠశాలకు నీరు సరఫరా చేయడం వరకే తమ విధి అని, మినీ ట్యాంకు నిర్మాణం గ్రామ పంచాయతీ తీర్మాణంతో ఏర్పాటు చేయించుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు