బహుజన బిడ్డగా అవకాశం ఇవ్వండి

6 Nov, 2023 02:08 IST|Sakshi
తారాపురంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

మల్దకల్‌ /గట్టు: గద్వాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు బడుగు, బలహీన వర్గాల, బహుజన బిడ్డకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి చేసి, చూపుతామని జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత కోరారు. ఆదివారం గట్టు మండల పరిధిలోని తారాపురం, జోకనగట్టు, గొర్లఖాన్‌దొడ్డి గ్రామాల్లో, మల్దకల్‌ మండలంలోని తాటికుంట, పెద్దొడ్డి గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషిచేస్తానని తెలిపారు. గత పాలకులు తమ కుటుంబాలను అభివృద్ధి చేసుకున్నారని, ప్రజల అభివృద్ధిని విస్మరించినట్లు ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అధికారంలోకి రాగానే అమలు చేస్తున్నట్లు తెలిపారు. రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరాకు రూ.15 వేల రైతుబంధు, కౌలు రైతులకు రూ.12 వేలు, ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షలు, రూ.500 కే గ్యాస్‌ సిలిండర్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వంటి వాటిని అమలు చేస్తున్నట్లు చెప్పారు. బడుగు, బలహీనవర్గాల, బహుజన బిడ్డగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీలో ఉన్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ, ఉద్యోగ అవకాశాలు, ప్రాజెక్టులు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన్నట్లు వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు మధుసూదన్‌బాబు, బండ్ల రాజశేఖర్‌రెడ్డి, శంకర్‌, నల్లారెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, రామకృష్ణ, రఘపతి, రాజశేఖర్‌రెడ్డి, గోవిందు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు