పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ

14 Nov, 2023 01:44 IST|Sakshi

గద్వాల రూరల్‌: సాధారణ శాసనసభ ఎన్నికలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేలా అధికారులందరూ కృషి చేయాలని ఎన్నికల పరిశీలకులు పి.వసంత్‌కుమార్‌ అన్నారు. సోమవారం ఆయనకు ఐడీవోసీ కార్యాలయంలో కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్‌ అపూర్వ్‌చౌహాన్‌లు సాదారంగా స్వాగతం పలికారు. ఈసందర్భంగా పరిశీలకులు ఐడీవోసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీ–విజిల్‌ కేంద్రం, కంట్రోల్‌రూం, ఎంసీఎంసీ కేంద్రం, మీడియా కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల నిర్వహణకు అవసమైన చర్యలు, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వివరాల గురించి కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు లిక్కర్‌, కానుకలు, డబ్బు తరలింపు వాటిపై ప్రత్యేక నిఘా వేసి నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి ఎవరైన ఫిర్యాదు చేయాలనుకుంటే నేరుగా సెల్‌ నం.6300332716కు ఫోన్‌ చేయవచ్చన్నారు. అలంపూర్‌ నియోజకవర్గానికి సంబంధించి ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, గద్వాల నియోజకవర్గానికి సంబంధించి సాయంత్రం 4గంటల నుంచి 6గంటల వరకు ఫోన్‌ ద్వారా కాని లేదా రేవులపల్లిలోని జెన్‌కో గెస్ట్‌ హౌస్‌లో నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

ఆదిశిలా క్షేత్రంలో

అమావాస్య ప్రత్యేక పూజలు

మల్దకల్‌: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తులు అమావాస్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా అర్చకులు మధుసూదనాచారి, రవిచారి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అదే విధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్వాల పట్టణంలోని కాకతీయ టెక్నోస్కూల్‌ యజమాన్యం ఆదిశిలా క్షేత్రంలో భక్తులకు ఉచిత అన్నదానం సౌకర్యం కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు అరవిందరావు, చంద్రశేఖర్‌రావు, అర్చకులు మధుసూధనాచారి, రవిచారి, నాగరాజుశర్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు