ప్రతి అంశం పరిగణలోకి..

2 Dec, 2023 01:38 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి పాలమూరులోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా పోరు కొనసాగగా.. అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులు శుక్రవారం ఎవరికి వారు లెక్కల్లో మునిగారు. గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో వార్డులు, పోలింగ్‌ బూత్‌ల వారీగా గణనలో నిమగ్నమయ్యారు. పోలింగ్‌ ఏజెంట్ల నుంచి పోలైన ఓట్ల జాబితాలను ముందు పెట్టుకుని.. పార్టీ ముఖ్య నేతలతో కలిసి అంచనా వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి.. తమకు ఎన్ని వస్తాయి? ప్రత్యర్థికి పడేటివి ఎన్ని?అని పూర్తిస్థాయిలో జల్లెడ పడుతున్నారు. తగ్గిన, పెరిగిన ఓట్లతో పాటు సైలెంట్‌ ఓటింగ్‌ ఎటువైపు మొగ్గు చూపే అకాశముందనే అంశాలపై పూర్తిస్థాయిలో కూపీ లాగుతున్నారు. ప్రాథమిక స్థాయిలో అభ్యర్థులు గెలుపోటములపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందనే ఆందోళన అంతర్లీనంగా ఉన్నప్పటికీ.. ఎవరికి వారు తామే గెల్తున్నామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికల అధికారులు ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. అదే రోజు ఫలితాలు వెల్లడించనుండగా.. సస్పెన్స్‌కు తెరపడనుంది.

ప్రతి అంశం పరిగణలోకి..

ఈ ఎన్నికల్లో కల్వకుర్తి, మక్తల్‌, కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగినట్లు పోలింగ్‌ సరళి స్పష్టం చేస్తోంది. మహబూబ్‌నగర్‌లో కారు, హస్తానికి దీటుగా బీజేపీ అగ్రనేతలతో విస్తృత ప్రచారం చేసినా.. పోలింగ్‌కు వచ్చేసరికి బోల్తాపడినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఓట్లు ఎటువైపు మళ్లాయి? అనేది క్లిష్టంగా మారింది. ఇవి పోనూ మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇలా అభ్యర్థులు ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు