ఐసీటీసీ కేంద్రాల ఎత్తివేత?

3 Dec, 2023 00:52 IST|Sakshi
జడ్చర్ల ఆస్పత్రిలోని ఐసీటీసీ కేంద్రం

జడ్చర్ల టౌన్‌: ఉమ్మడి జిల్లాలోని హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నిర్ధారణ పరీక్ష కేంద్రాల తొలగింపునకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో జడ్చర్ల, కల్వకుర్తి, ఆమనగల్‌, కొడంగల్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న కేంద్రాలను ఎత్తివేసేందుకు రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు రానున్నాయి. నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ పై నాలుగు కేంద్రాలను ఎత్తివేయాలని ఈ ఏడాది జూన్‌లోనే నిర్ణయం తీసుకుంది. వివిధ కారణాలతో కొంత జాప్యం జరిగింది. తాజాగా రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు ముగియడంతో కేంద్రాల ఎత్తివేత విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నిర్ధారణ పరీక్షల్లో కీలకమైన కేంద్రాలను తొలగించి వాటి స్థానంలో ఆయా ఆస్పత్రుల్లో పనిచేసే ల్యాబ్‌ టెక్నీషియన్స్‌కు శాంపిల్‌ సేకరించే బాధ్యత అప్పగించేలా ఉత్తర్వులు రానున్నాయి.

రాష్ట్ర విభజన తర్వాత..

1992లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నియంత్రించే లక్ష్యంతో కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (న్యాకో)ను స్థాపించింది. ఆయా రాష్ట్రాల్లో ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీల ఆధ్వర్యంలో పనిచేస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ద్వారా న్యాకో విధులు నిర్వహిస్తుంది. అయితే మొదట జిల్లాకేంద్రాల్లోనే న్యాకో ఐసీటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 30 పడకలు, ఆపై ఉన్న ఆస్పత్రుల్లోనూ ప్రారంభించింది. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, కొల్లాపూర్‌, అచ్చంపేట, షాద్‌నగర్‌, మక్తల్‌, కొడంగల్‌, వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, ఏనుగొండ ఎస్‌వీఎస్‌ ఆస్పత్రులతోపాటు ఆమనగల్‌లోనూ ఐసీటీసీ కేంద్రాలు అందుబాటులోకి వచ్చి సేవలు అందిస్తున్నాయి. ఆయా కేంద్రాల్లో నెలకు కనీసం 300 నుంచి 500 పరీక్షలు చేస్తున్నారు. ఐసీటీసీ కేంద్రాల్లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నిర్ధారణ పరీక్షలు గర్భిణులు, టీబీ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, తరచుగా రక్తమార్పిడి చేయించుకునే వారికి తప్పనిసరిగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నిర్ధారణ పరీక్షలు చేయాల్సిందే. హెచ్‌ఐవీ నిర్ధారణ అయిన వారు గర్భిణులు అయితే వారికి పుట్టిన పిల్లలకు సైతం పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎత్తివేసేందుకు సిద్ధంగా ఉన్న జడ్చర్ల ఆస్పత్రిలోని ప్రతినెలా 500లకు తక్కువ కాకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

రెండు జాతీయ రహదారులతో..

జడ్చర్ల మీదుగా 44, 167 నంబర్‌ రెండు జాతీయ రహదారులు వెళ్తుండటంతో ఈ ప్రాంతంలో వ్యభిచారం ఎక్కువగా జరుగుతుంది. వ్యభిచార వృత్తిలో ఉన్న వారితోపాటు వారి వద్దకు వెళ్లేవారు సైతం హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నిర్ధారణ పరీక్షలు చేసుకుంటున్నారు. అలాగే గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి సైతం పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఐసీటీసీ కేంద్రం ఎత్తివేస్తే వీరందరికి ఇబ్బందిగా మారనుంది. తాత్కాలికంగా ఆస్పత్రుల్లోని జనరల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్స్‌కు బాధ్యతలు అప్పగించేలా చర్యలు తీసుకున్నప్పటికీ పనిభారం పెరిగి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వాస్తవానికి న్యాకో ఎత్తివేయాలని భావిస్తున్న కేంద్రాల్లో జడ్చర్లలో సేవలు అధికంగా జరుగుతున్నాయి. అయితే ఏనుగొండ ఎస్‌వీఎస్‌ ఆస్పత్రి సమీపంలోనే ఉండటం వల్ల ఈ కేంద్రం ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆమనగల్‌ కేంద్రంలో కౌన్సిలర్‌ లేకపోవడంతో అక్కడ పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయి. ఇక కల్వకుర్తి, కొడంగల్‌ కేంద్రాల్లోనూ నెలవారి పరీక్షలు తక్కువగా నమోదవుతుండటంతో ఆయా కేంద్రాలు ఎత్తివేసేందుకు నిర్ణయించారు.

● ఐసీటీసీ కేంద్రం ఎత్తివేత విషయమై స్థానిక ల్యాబ్‌ టెక్నీషియన్‌ శ్రీకాంత్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు రానున్నట్లు వెల్లడించారు. కేంద్రం ఎత్తివేత గురించి ఇది వరకే సమాచారం ఇచ్చారని, ఉత్తర్వులు రాగానే ఇక్కడి నుంచి తొలగిస్తామని చెప్పారు.

ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల, కల్వకుర్తి, ఆమనగల్‌, కొడంగల్‌లో కేంద్రాలు

రెండు, మూడురోజుల్లో రానున్న ఉత్తర్వులు

ఇకపై ఎయిడ్స్‌ పరీక్షల నిర్ధారణకుఇబ్బందులు

మరిన్ని వార్తలు