కౌంటింగ్‌ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు

3 Dec, 2023 00:52 IST|Sakshi
శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

గద్వాల రూరల్‌: సాధారణ ఎన్నికల్లో భాగంగా ఈనెల 3వ తేదీ ఆదివారం కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి అన్నారు. ఽశనివారం ఐడీవోసీ కార్యాలయంలో సాధారణ ఎన్నికల పరిశీలకులు పి.వసంత్‌కుమార్‌, కౌంటింగ్‌ పరిశీలకులు అనురాధతో కలిసి ర్యాండమైజేషన్‌ విధానంలో సిబ్బందిని కేటాయించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గద్వాల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు–17మంది, కౌంటింగ్‌ సహాయకులు–17మంది, అదేవిధంగా పోస్టల్‌బ్యాలెట్‌ లెక్కింపు కోసం ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు సహాయకులు, ఒక మైక్రోపరిశీలకులను నియమించినట్లు తెలిపారు. అదేవిధంగా అలంపూర్‌ నియోజకవర్గానికి సంబంధించి 17మంది సూపర్‌వైజర్లు, 17మంది సహాయకులు, పోస్టల్‌బ్యాలెట్ల లెక్కింపుకు సంబంధించి ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు సహాయకులు, ఒక మైక్రో పరిశీలకులు నియమించినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అపూర్వ్‌చౌహాన్‌, చీర్ల శ్రీనివాసులు, ఆర్డీవో చంద్రకళ, ఎస్‌డీసీ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

అధికారులు, సిబ్బందికి శిక్షణ

పొరపాట్లకు తావులేకుండా పకడ్బందిగా కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి అన్నారు. శనివారం ఆమె ఐడీవోసీ కార్యాయంలో కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బూత్‌ల వారీగా ఈవీఎం, కంట్రోల్‌ యూనిట్లు సరిచూసుకుని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కౌంటింగ్‌ ఏజెంట్ల సమక్షంలో లెక్కింపు పక్రియను మొదలుపెట్టాలన్నారు. ఉదయం 8గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు, అనంతరం 8:30గంటలకు ఈవీఎం ల లెక్కింపును ప్రారంభించాలన్నారు. ప్రతిరౌండ్‌ ఫలితాలు ఎప్పటికప్పుడు ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అపూర్వ్‌చౌహాన్‌, చీర్ల శ్రీనివాసులు, ఆర్డీవో చంద్రకళ, కౌంటింగ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పొరపాట్లకు తావివ్వొద్దు

గద్వాల, అలంపూర్‌కు చెరో 38 మంది సూపర్‌వైజర్లు

కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

మరిన్ని వార్తలు