హస్తందే హవా

4 Dec, 2023 02:40 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 స్థానాల్లో 12 కై వసం చేసుకుంది. మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాల్లో ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎన్నికల అధికారులు తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు, ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌, దేవరకద్ర, మక్తల్‌, నారాయణపేట, కొడంగల్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, అచ్చంపేట, కల్వకుర్తిలో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. గద్వాల, అలంపూర్‌లో మాత్రం బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. మక్తల్‌, కొల్లాపూర్‌, కల్వకుర్తి మినహా బీజేపీ అభ్యర్థులు కనీస ప్రభావం చూపించలేకపోయారు.

దేవరకద్ర: రౌండ్‌రౌండ్‌కూ ఉత్కంఠ

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవరకద్రలో చివరి రౌండ్‌లో ఫలితం తేలింది. రౌండ్‌ రౌండ్‌కూ ఉత్కంఠ నెలకొంది. చివరి రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి జి.మధుసూదన్‌రెడ్డికి 907ఓట్ల మెజార్టీ రాగా.. పోస్టల్‌ బ్యాలెట్‌తో కలుపుకుని మొత్తం 1,392 ఓట్ల మెజార్టీతో తాజా మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డిపై ఆయన విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

మంత్రులకు తప్పని ఓటమి

మహబూబ్‌నగర్‌, వనపర్తిలో బీఆర్‌ఎస్‌కు చెందిన తాజా మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డికి చుక్కెదురైంది. మహబూబ్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 18,738 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వనపర్తిలో నిరంజన్‌రెడ్డిపై మేఘారెడ్డి 25,320 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

వాడిన ‘కమలం’

ఎన్నికల క్రమంలో బీజేపీకి చెందిన ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ తదితర అగ్రనేతలు పాలమూరులోని పలు నియోజకవర్గాలను చుట్టేశారు. బండి, ఈటల రాజేందర్‌ వంటి స్టార్‌ క్యాంపెయినర్లు, వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు పార్టీ అభ్యర్థుల తరఫున భారీ బహిరంగసభలు, ప్రచారంతో హోరెత్తించారు. కానీ పోలింగ్‌ నాటికి చతికిలపడినట్లు కౌంటింగ్‌ సందర్భంగా స్పష్టమైంది. కల్వకుర్తి, మక్తల్‌ మినహా మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, వనపర్తి, అచ్చంపేట, షాద్‌నగర్‌, కొడంగల్‌, గద్వాల, అలంపూర్‌, కొల్లాపూర్‌లో డిపాజిట్‌ కూడా దక్కలేదు. కల్వకుర్తిలో గతంలో స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన ఆచారికి ఆరోసారి నిరాశే ఎదురైంది. నాగర్‌కర్నూల్‌లో జనసేన అభ్యర్థికి సైతం డిపాజిట్‌ రాలేదు.

విజయోత్సవ ర్యాలీలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

ఉమ్మడి పాలమూరులో 14 అసెంబ్లీ స్థానాల్లో 12 గెలుపు

తొలిసారిగా గెలుపొందిన వారు..

జనంపల్లి అనిరుధ్‌రెడ్డి (కాం్చగ్రెస్‌– జడ్చర్ల)

చిట్టెం పర్ణికారెడ్డి (కాంగ్రెస్‌–నారాయణపేట)

జి.మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్‌–దేవరకద్ర)

వాకిటి శ్రీహరి (కాంగ్రెస్‌ – మక్తల్‌)

వీర్లపల్లి శంకర్‌ (కాంగ్రెస్‌ – షాద్‌నగర్‌)

కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి

(కాంగ్రెస్‌–నాగర్‌కర్నూల్‌)

కసిరెడ్డి నారాయణరెడ్డి

(కాంగ్రెస్‌ – కల్వకుర్తి)

మేఘారెడ్డి (కాంగ్రెస్‌ – వనపర్తి)

విజయుడు (బీఆర్‌ఎస్‌ – అలంపూర్‌)

ఈ తొమ్మిది మంది తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టనుండగా.. వారందరూ యు వనాయకులే. వీరిలో నాగర్‌కర్నూల్‌, నారాయ ణపేటలో గెలుపొందిన రాజేష్‌రెడ్డి, పర్ణికారెడ్డి డాక్టర్లు కావడం విశేషం. అదేవిధంగా అచ్చంపేటలో విజయం సాధించిన వంశీకృష్ణ వైద్యుడే.

‘చల్ల’గా విజయుడై..

అలంపూర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయుడు గెలుపొందడం హాట్‌టాపిక్‌గా మారింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్రహంను ఖరారు చేసిన తర్వాత.. పలు పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అబ్రహంను విభేదించిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అనూహ్యంగా ఉపాధి హామీ పథకం ఉద్యోగిగా ఉన్న తన అనుచరుడు విజయుడిని తెరపైకి తీసుకొచ్చారు. అధినేత కేసీఆర్‌ను ఒప్పించి విజయుడికే బీఫామ్‌ ఇప్పించారు. ఆ తర్వాత మందా జగన్నాథం, అబ్రహం కాంగ్రెస్‌లోకి వెళ్లగా.. అందరూ సంపత్‌దే గెలుపు అని భావించారు. కానీ అనూహ్యంగా విజయుడు ఉమ్మడి జిల్లాలోనే రెండో అత్యధిక ఓట్లతో గెలుపొందడం హాట్‌ టాపిక్‌గా మారింది. చల్లా చాతుర్యం ఆయనను గెలిపించిందని.. కేసీఆర్‌కు ఇచ్చిన మాట నిలుపుకున్నారని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

గద్వాల, అలంపూర్‌లో ‘కారు’ విజయం

మహబూబ్‌నగర్‌, వనపర్తిలో మంత్రులకు చుక్కెదురు

తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్న 9 మంది..

దేవరకద్రలో చివరి రౌండ్‌కు తేలిన ఫలితం

పోస్టల్‌తో కలిపి 1,392 ఓట్ల మెజార్టీతోజీఎమ్మార్‌ గెలుపు

బీజేపీకి కల్వకుర్తి, మక్తల్‌లో మినహా అన్ని సెగ్మెంట్లలో డిపాజిట్‌ గల్లంతు

అత్యధికంగా వంశీకృష్ణ.. అత్యల్పంగా జీఎమ్మార్‌కు..

ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గెలుపొందిన అభ్యర్థుల మెజార్టీని పరిశీలిస్తే అచ్చంపేట కాంగ్రెస్‌ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ 49,326 ఓట్ల ఆధిక్యతతో గెలుపొంది మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత కొడంగల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి 32,532 ఓట్ల మెజార్టీతో రెండో స్థానం, అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయుడు 30,573 ఓట్ల ఆధిక్యతతో మూడో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో కాంగ్రెస్‌కు చెందిన కొల్లాపూర్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌, మక్తల్‌, జడ్చర్ల, నారాయణపేట, షాద్‌నగర్‌ అభ్యర్థులు జూపల్లి (29,931), మేఘారెడ్డి (25,320), యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (18,738), వాకిటి శ్రీహరి (17,525), అనిరుధ్‌రెడ్డి (15,171), పర్ణికారెడ్డి (7,951), వీర్లపల్లి శంకర్‌ (7,128) ఉన్నారు. 11వ స్థానంలో గద్వాలకు చెందిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (7,036) నిలిచారు. 12 స్థానంలో కాంగ్రెస్‌ కల్వకుర్తి అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి (5,410), 13వ స్థానంలో నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి (5,248) నిలవగా.. దేవరకద్ర కాంగ్రెస్‌ అభ్యర్థి జి.మధుసూదన్‌రెడ్డి (1,392) అత్యల్ప మెజార్టీతో చివరిస్థానంలో నిలిచారు. 2018లో అత్యధిక మెజార్టీ 57,775 ఓట్లతో మహబూబ్‌నగర్‌ నుంచి అప్పటి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, తాజా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గెలుపొందగా.. ఆ రికార్డ్‌ను ఎవరూ సాధించలేకపోయారు.

>
మరిన్ని వార్తలు