బస్సులో గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

22 Mar, 2023 01:12 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న గంజాయి, అరెస్టు చేసిన నిందితుడితో ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది

రాజమహేంద్రవరం రూరల్‌: తుని నుంచి తమిళనాడుకు ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) పోలీసులు రాజమహేంద్రవరంలో అరెస్టు చేశారు. అతడి నుంచి 4.89 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్‌ఈబీ అధికారి పిట్టా సోమశేఖర్‌ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి తరలింపుపై విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు సోమశేఖర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ ఎం.రాంబాబు సూచనల మేరకు ఎస్‌ఈబీ నార్త్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ పీవీ రమణ, ఎస్‌ఈబీ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.అప్పారావు, తమ సిబ్బందితో కలిసి స్థానిక వై జంక్షన్‌ వద్ద సోమవారం సాయంత్రం తుని – శ్రీశైలం ఆర్టీసీ బస్సును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్రం ఆరుంబాక్కం ప్రాంతానికి చెందిన ఆనంద రవి కాలేజీ పుస్తకాలు తీసుకువెళ్లే బ్యాగ్‌లో మూడు పొట్లాల్లో గంజాయితో పట్టుబట్టాడు. అతడిని అరెస్టు చేసి 4.89 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనిని రూ.25 వేలకు కొనుగోలు చేసినట్టు విచారణలో ఆనంద రవి తెలిపాడు. ఈ గంజాయిని తుని బైపాస్‌ రోడ్డులో ఒక వ్యక్తి వద్ద కొనుగోలు చేసి, తుని నుంచి బస్సులో విజయవాడ వరకూ వెళ్తున్నాడు. అక్కడి నుంచి రాత్రి రైలులో చైన్నె చేరుకుని, అక్కడి నుంచి ఆరుంబాక్కం చేరుకుంటాడు. ఈ కేసులో గంజాయి ఇస్తున్న వారు, దానిని తీసుకుంటున్న వారు ఎవరనే అంశాలపై విచారణ చేపడతామని సోమశేఖర్‌ తెలిపారు. ఆనంద రవి రెండేళ్లుగా ఇదేవిధంగా సుమారు 5 కిలోల చొప్పున గంజాయిని దఫదఫాలుగా తరలిస్తున్నాడని అన్నారు. ఇంతకు ముందు కూడా తుని నుంచి ఏడుసార్లు గంజాయి తీసుకువెళ్లాడన్నారు.

మరిన్ని వార్తలు