భక్తుల చెంతకే భగవంతుడు వేంచేసిన వేళ..

22 Mar, 2023 01:12 IST|Sakshi
ఘనంగా సాగుతున్న స్వామివారి వాహన సేవ

ఆత్రేయపురం: సాక్షాత్తూ ఆ వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువే శ్రీ, భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామిగా భువికి దిగి వచ్చి.. వాహనాలపై కొలువుతీరి.. తమ చెంతకే వేంచేసిన వేళ భక్తజనం.. ఆ స్వామిని కన్నులారా దర్శించి పులకించిపోయారు. కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి క్షేత్రంలో జరుగుతున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా.. వేద పండితులు మంగళవారం వేకువనే మేళతాళాలతో తీర్థపు బిందెతో పావన గౌతమీ గోదావరి జలాలు తీసుకువచ్చి, స్వామివారిని వేదమంత్రోక్తంగా అభిషేకించారు. సుస్వరంగా చతుర్వేద సాగించిన పారాయణతో ఆ ప్రాంతానికి మరింత పవిత్రతను అద్దారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం గరుడ, సింహ వాహనాలు, పల్లకిపై స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి వారికి పూజా కార్యక్రమాలు, దివ్య ప్రబంధం, నీరాజన మంత్రపుష్పాదులు ఘనంగా నిర్వహించారు. తొలుత ఆళ్వారులకు వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యాన సభ్యులు, సిబ్బంది పర్యవేక్షించారు.

ఫ వాడపల్లిలో ఘనంగా వాహన సేవలు

ఫ స్వామిని దర్శించి పులకించిన భక్తజనం

ఫ కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు

మరిన్ని వార్తలు