బార్‌ కోడింగ్‌.. సత్ఫలితాల లోడింగ్‌

22 Mar, 2023 23:40 IST|Sakshi
బార్‌ కోడింగ్‌ పేపర్‌

రాయవరం: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ప్రవేశపెట్టిన బార్‌కోడింగ్‌ విధానం సత్ఫలితాలనివ్వడంతో ఈ ఏడాది కూడా అదే విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో ఎటువంటి ప్రభావం పడకుండా ఉండేందుకు ఈ విధానం ప్రవేశపెట్టారు. పరీక్షల ప్రారంభానికి ముందుగానే బార్‌కోడ్‌ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

2007లో ప్రారంభం

విద్యార్థి దశలో కీలకమైన పదో తరగతి పరీక్షల్లో మూల్యాంకనం చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు, అక్రమాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు 2007లో బార్‌కోడింగ్‌ విధానం ప్రారంభించారు. బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ ఈ విధానాన్ని తొలిసారి సోషల్‌ పరీక్షతో ప్రారంభించింది. విద్యార్థి పేరుతో కూడిన సమాధాన పత్రాలు ఎవరివన్నది తెలియకుండా ఉండేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కాలమ్స్‌తో బార్‌కోడింగ్‌ విధానాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం తీసుకు వచ్చింది. ఈ విధానంలో సమాధాన పత్రం ఎవరిదో తెలియదు. క్రమంగా ఈ విధానాన్ని అన్ని ప్రశ్నపత్రాలకూ అమలు చేశారు.

ముందుగా అవగాహన పెంచితేనే..

ప్రారంభంలో బార్‌ కోడింగ్‌ విధానంతో కొంత గందరగోళానికి గురయ్యారు. అయి తే ఈ విధానాన్ని అన్ని పరీక్షలకూ విస్తరించడంతో బార్‌ కోడింగ్‌ విధానమే మంచిదనే ఆలోచనకు అందరూ వచ్చారు. ఏటా పదో తరగతి విద్యార్థులకు ఈ విధానం కొత్తగా ఉంటుంది కాబట్టి పరీక్షలకు ముందే బార్‌ కోడింగ్‌పై ప్రత్యేక అవగాహన పెంచితే బాగుంటుంది. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటే విద్యార్థులకు మరింత అవగాహన కలుగుతుందని పలువురు తల్లిదండ్రులు సూచిస్తున్నారు.

24 పేజీల బుక్‌లెట్‌

పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులకు 24 పేజీలతో బుక్‌లెట్‌ ఇవ్వనున్నారు. గతంలో నాలుగు పేజీలతో మెయిన్‌ ఆన్సర్‌ షీట్‌ ఇచ్చిన అనంతరం విద్యార్థికి అవసరమైన అదనపు సమాధాన పత్రాలు ఇచ్చేవారు. గత ఏడాది నుంచి సమాధానాలు రాసేందుకు ఇంటర్మీడియెట్‌లో మాదిరిగానే బుక్‌లెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది కూడా సత్ఫలితాలనిచ్చింది. ఈ ఏడాది కూడా విద్యార్థులు సమాధాన పత్రాలను బుక్‌లెట్‌లోనే రాయాల్సి ఉంటుంది. ఫిజిక్స్‌, బయాలజీ పేపర్లకు 12 పేజీలు, మిగిలిన పేపర్లకు 24 పేజీల బుక్‌లెట్లు సరఫరా చేస్తారు. ఇప్పటికే బుక్‌లెట్లు ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నాయి. బుక్‌లెట్‌ విధానం అమలు చేయడం వలన తెలివైన విద్యార్థులకు మేలు చేకూరుతుంది.

15 ఏళ్లుగా టెన్త్‌ పరీక్షల్లో అదే విధానం

ఈ ఏడాదీ అమలు అవగాహన కల్పిస్తున్న ప్రధానోపాధ్యాయులు

మరిన్ని వార్తలు