జిల్లాలో ‘ఆత్మీయ’ సందడి!

27 Mar, 2023 01:44 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: ఎన్నికల ఏడాది కావడంతో ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలోనే ఉండాలని, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆదేశించింది. కార్యకర్తల మనోభావాలు తెలుసుకుని వారు చెప్పినవి విని అమలు చేయాలని పేర్కొంది. దీంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో తొలి సమ్మేళనం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం తాండూరులో జరిగింది. దీనికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ సమ్మేళనానికి భారీ జనసమీకరణ చేయడంతో పాటు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు. తర్వాత కామారెడ్డి నియోజకవర్గంలో వరుసగా సమ్మేళనాలు జరిగాయి. ఇప్పటికే బీబీపేట, దోమకొండ, రాజంపేట, భిక్కనూరు, రామారెడ్డి, మాచారెడ్డి, కామారెడ్డి మండలాల సమ్మేళనాలు నిర్వహించారు. శనివారం కామారెడ్డి పట్టణ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాల సమావేశాలు పూర్తయ్యాయి. ఆయా సమ్మేళనాల్లో ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని, ప్రజలకు వాస్తవాలు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.

జుక్కల్‌ నియోజకవర్గంలోని పెద్దకొడప్‌గల్‌, బిచ్కుందలలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే ఆయా సమ్మేళనాల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్‌ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు, నాయకులు కార్యకర్తలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారితో కలిసి భోజనాలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇప్పటినుంచే కేడర్‌ను సమాయత్తం చేసేలా పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

కార్యకర్తల్లో జోష్‌..

అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో గ్రామాలకు ఎమ్మెల్యేలు వెళ్తున్నప్పటికీ కార్యకర్తలకు సమయం ఇచ్చే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో ఆత్మీయ సమ్మేళనాల వల్ల రోజంతా కార్యకర్తలకు సమయం వెచ్చించే అవకాశం దొరికింది. దీంతో కార్యకర్తలు తమ సమస్యలు, తమ పరిధిలోని గ్రామాలు/వార్డుల్లోని సమస్యలను చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేలు వారి సమస్యలు వింటూ పరిష్కరిస్తామన్న భరోసా ఇస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కార్యకర్తలు మరింత పట్టుదలతో పనిచేయాలని ఎమ్మెల్యేలు వారికి వివరిస్తున్నారు. దీంతో ఆత్మీయ సమ్మేళనాలతో కార్యకర్తల్లో జోష్‌ కనిపిస్తోంది.

కామారెడ్డిలో మాట్లాడుతున్న గంప గోవర్ధన్‌(ఫైల్‌), పెద్దకొడప్‌గల్‌ సమ్మేళనంలో హన్మంత్‌ సింధే(ఫైల్‌)

మండలాలవారీగా బీఆర్‌ఎస్‌

సమ్మేళనాలు

కార్యకర్తలతో కలిసి భోజనాలు

చేస్తున్న ఎమ్మెల్యేలు

మరిన్ని వార్తలు