ఆదాయమున్నా.. అభివృద్ధి శూన్యం

27 Mar, 2023 01:44 IST|Sakshi

రామారెడ్డి: నిత్యం భక్తుల రద్దీ ఉండే ఇసన్నపల్లి(రామారెడ్డి) కాలభైరవుడి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆలయానికి ఆదాయం వస్తున్నా.. వసతులు కల్పించడం లేదు. పురాతన చరిత్ర గల ఈ ఆలయాన్ని ఎంతో మంది భక్తులు దర్శించుకుంటారు. 1974లో దేవాదాయశాఖ ఈ గుడిని త మ ఆధీనంలోకి తీసుకుంది. భక్తులు ఇచ్చిన రూ.50 లక్షల విరాళాలతో 2001లో ఆలయం నిర్మించి, రేకుల షెడ్డులో ఉన్న స్వామి విగ్రహాన్ని అందులోకి మార్చారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు 2009లో రూ.ఐదు లక్షలు మాత్రమే మంజూరు చేసింది. ఆ నిధులతో శనేశ్వరాలయం నిర్మించారు. ఎంపీ బీబీ పాటిల్‌ ఆలయం ప్రాగణంలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు కేటాయించారు. ఈ నిధులు తప్పా ఇప్పటి వరకు కాలభైరవుడి ఆలయానికి ఏ ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయలేదు. దాతలు, భక్తుల సహాయంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. నాలుగు వైపులా గోపురాలను నిర్మించారు. ఒక్కో గోపురానికి రూ.50లక్షలకుపైగా ఖర్చు అయితే దాతలే సహకరించారు.

అనేక సమస్యలు

ఆలయంలో మూల బావి, కోనేరు దగ్గర స్నానపు గదుల నిర్మాణం చేపట్టాలి. మహిళలు దుస్తులు మార్చుకోడానికి తాత్కాలికంగా రేకులతో షెడ్లు వేశారు. శాశ్వత గదులు నిర్మించాల్సి ఉంది. భక్తులకు మరుగుదొడ్లు లేవు. ఆలయంలో గార్డెన్‌, ఉద్యానవనం, ధాన్య మందిరం నిర్మించాల్సి ఉంది. మూల బావి దగ్గర లైటింగ్‌ సిస్టం, ప్రధాన ఆలయం, గోపురాల మధ్య కులింగ్‌ రేకుల నిర్మాణం చేయాలి. మరో పక్క ప్రధాన గోపురం ఎదుట రోడ్డు వెడల్పు చేయాల్సి ఉంది. రోడ్డు వెడల్పు చేయాలంటే అక్కడ ఉన్న ఇళ్లను తొలగించాలి. ఆ కుటుంబాలకు పరిహారం కోసం పెద్ద మొత్తంలో నిధులు కావాలి.

కల్యాణ మండపం నిర్మించాలి

కాలభైరవుడి ఆలయం ప్రాగణంలో అనేక వివాహాలు జరుగుతాయి. కానీ వివాహాలు చేసుకోడానికి వీలుగా వసతులు లేవు. వివాహాలు చేసుకునే వారే ప్రాంగణంలో తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేసుకుంటారు. వర్షాకాలంలో వివాహాలకు ఇబ్బందిగా ఉంటుంది. ప్రభుత్వం అన్ని వసతులతో కల్యాణ మండపం ఏర్పాటు చేయాలి.

‘ముఖ్యమంత్రిని తీసుకొస్తా’

కాలభైరవుడి ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తీసుకోస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ అదివారం రామారెడ్డిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆలయానికి వస్తే నిధులు కేటాయించే అవకాశం ఉందని, సీఎంను తీసుకు రావాలని ఇసన్నపల్లి సర్పంచ్‌ బాలమణి, రామారెడ్డి సర్పంచ్‌ సంజీవ్‌ ఎమ్మెల్యే సురేందర్‌ను కోరారు.

కాలభైరవుడి ఆలయం

కాలభైరవుడి ఆలయంలో

వసతులు కరువు

వచ్చిన ఆదాయంలో 40శాతం

దేవాదాయ శాఖకే..

దాతల విరాళాలతోనే వసతుల కల్పన

ఏటా ఉత్సవాలు

ప్రతి ఏటా కార్తీక బహుళ అష్టమి సందర్భంగా కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుతారు. ఉత్సవాలకు భారీగా భక్తులు హాజరు అవుతారు. ఏటా ఆలయానికి భక్తులు భారీగా వస్తుండటంతో ఆదాయం కూడా బాగానే వస్తుంది. ఆలయానికి వచ్చే ఆదాయంలో నుంచి సెస్‌ రూపంలో 20శాతం దేవాదాయ శాఖకు చెల్లిస్తారు. తాజాగా ఉద్యోగుల వేతనాల కోసం మరో 20 శాతం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన ఆదాయంలో 40శాతం అటే పోతే గుడి అభివృద్ధి, నిర్వహణకు నిధులు ఎలా అని గ్రామస్తులు అంటున్నారు. 2022–23 సంవత్సరంలో ఆలయానికి భక్తుల ద్వారా రూ.49 లక్షల ఆదాయం వచ్చింది. ఇందులో 19.6 లక్షలను దేవాదాయ శాఖకు చెల్లించారు.

మరిన్ని వార్తలు