ఒక్కరోజు.. రెండు సభలు

30 Oct, 2023 00:50 IST|Sakshi

నేడు జుక్కల్‌, బాన్సువాడలలో

బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలు

పాల్గొననున్న సీఎం కేసీఆర్‌

భారీ జన సమీకరణపై నేతల దృష్టి

సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ సోమవారం జిల్లాలో పర్య టించనున్నారు. జుక్కల్‌ చౌరస్తా, బాన్సువాడలలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలలో ఆయన పాల్గొంటారు. సభను విజయవంతం చేయడం కోసం భారీ జన సమీకరణపై పార్టీ నేతలు దృష్టి సారించారు.

జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నింటా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కామారెడ్డిలో సి ట్టింగ్‌ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు బదులు సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్నారు. బాన్సువాడలో స్పీకర్‌ పోచారం, ఎల్లారెడ్డిలో జాజాల సురేందర్‌, జుక్కల్‌లో హన్మంత్‌ సింధే బరిలో ఉన్నారు. అధికార పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతోపాటు బీ ఫామ్‌లూ అందించింది. దీంతో అధికార పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్నీ ప్రారంభించారు.

సీఎం పర్యటన ఇలా..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరతారు. మధ్యాహ్నం 2 గంటలకు జుక్కల్‌ చౌరస్తా వద్ద ప్రజా ఆశీర్వాద సభ వేదికకు సమీపంలో ఏర్పాటు చేసిన హెలీపాడ్‌ వద్దకు చేరుకుంటారు. స్థానిక ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే అధ్యక్షతన జరిగే సభలో మాట్లాడతారు. సభ అనంతరం తిరిగి హెలీకాప్టర్‌లో బయలుదేరి బాన్సువాడ పట్టణంలోని అంగడిలోని సభాస్థలికి సమీపంలో ఏర్పాటు చేసిన హెలీపాడ్‌ వద్ద దిగి, నేరుగా ప్రజా ఆశీర్వాద సభా వేదిక వద్దకు చేరుకుంటారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తరపున ఎన్నికల ప్రచార సభలో మాట్లాడతారు. ఈ సభ ద్వారా సీఎం కేసీఆర్‌ జిల్లాకు ప్రత్యేకంగా ఏమైనా హామీలు ఇస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.

జుక్కల్‌ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక

మరిన్ని వార్తలు