ఐదేళ్లు మీకోసం రక్తం ధారపోస్తా..! : మంత్రి గంగుల కమలాకర్‌

9 Nov, 2023 08:32 IST|Sakshi
ఆర్డీవోకు నామినేషన్‌ పత్రాలు అందజేశాక ప్రజలతో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమాలకర్‌

20 రోజులు నా కోసం పనిచేయండి!

కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌..

నామినేషన్‌ దాఖలు!

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: హైదరాబాద్‌ సంపదపై ఆంధ్రావాళ్లు కన్నేశారని, వారికి వంతపాడుతున్న కాంగ్రెస్‌, బీజేపీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇరువై ఏళ్లుగా ఆశీర్వదిస్తున్న ప్రజలు మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే తన రక్తం ధారపోసి పనిచేస్తానని కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం కరీంనగర్‌ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసే ముందు కుటుంబ సభ్యులతో కలిసి నగరంలోని ప్రసన్నాంజనేయస్వామిని దర్శించుకున్నారు.

నామినేషన్‌ పత్రాలకు ప్రత్యేకపూజలు చేయించి బీఆర్‌ఎస్‌ నాయకులు కొత్త జైపాల్‌రెడ్డి, కంసాల శ్రీనివాస్‌, మెతుకు సత్యంతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చి రెండుసెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం కరీంనగర్‌ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజలతో నగరంలో భారీర్యాలీ నిర్వహించారు. తెలంగాణచౌక్‌లో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.

కాంగ్రెస్‌, బీజేపీ చెబుతున్న కల్లబొల్లి మాటలు నమ్మవద్దని, వారిహయాంలో జరిగిన అభివృద్ధి, పదేళ్లల్లో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. పచ్చని తెలంగాణలో చిచ్చుపెట్టాలని మళ్లీ ఆంధ్రా నాయకులు ఏకమవుతున్నారని, సీఎం కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించి హైదరాబాద్‌ సంపదను దోచుకెళ్లేందుకు తహతహలాడుతున్నారని ఆరోపించారు. ‘కేసీఆర్‌ లేని తెలంగాణ ఊహించుకోలేం.. తస్మాస్‌ జాగ్రత్త.. ఆ రెండు పార్టీలతో అప్రమత్తంగా లేకపోతే తెలంగాణ మళ్లీ అంధకారమవుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

20 రోజులు తన కోసం పనిచేస్తే ఐదేళ్లు మీకోసం తన రక్తం ధారపోస్తా అని భరోసా ఇచ్చారు. అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని, ముచ్చటగా సీఎం కేసీఆర్‌ను మూడోసారి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. మతోన్మాదంతో ఒక అభ్యర్థి, భూ కబ్జాలతో మరో అభ్యర్థి ఓట్ల కోసం వస్తున్నారని, నగరాన్ని సర్వనాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఇలాంటి వారికి ప్రజలే తగిన శాస్తి చేయాలని సూచించారు.

మేయర్‌ సునీల్‌రావు మాట్లాడుతూ.. కేబుల్‌ బ్రిడ్జ్‌ కూలిపోతుందని బండి సంజయ్‌ చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కరీంనగర్‌లో సంజయ్‌ ఏనాడూ తిరగలేదు కాబట్టి ఆయన కళ్లకు ఇన్ని రోజులు చేసిన అభివృద్ధి కనబడలేదని అన్నారు. నామినేషన్‌ వేసిన మంత్రి కమలాకర్‌కు ఎంఐఎం కరీంనగర్‌ అధ్యక్షుడు సయ్యద్‌ గులాం అహ్మద్‌ హుస్సేన్‌, నాయకులు మద్దతు తెలిపారు. నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పొన్నం అనిల్‌కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ రెడ్డవేణి మధు పాల్గొన్నారు.

గంగుల ఆస్తులు రూ.25.50 కోట్లు!
మంత్రి కమలాకర్‌ తన అఫిడవిట్‌లో మొత్తం రూ.25.50 కోట్ల స్థిరచరాస్తులు, రూ.50 లక్షల బ్యాంకు రుణాలు, 8 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివిన ఆయన తన వద్ద రూ.2.25 లక్షలు, 436 తులాల బంగారు కడియాలు, బ్రాస్‌లెట్లు ఇతర ఆభరణాలు(రూ.2.45 కోట్లు), 1995 మోడల్‌ యమహా బైక్‌, దాదాపు రూ.70 లక్షల విలువైన భారత్‌ బెంజ్‌ కారవాన్‌ వాహనాలు ఉన్నాయన్నారు. ఆయన భార్య రజిత వద్ద రూ.3.15 లక్షలు, 800 తులాల ఆభరణాలు(రూ.4.5 కోట్లు) ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన తన ఆస్తులు రూ.24.5 కోట్లు, అప్పులు రూ.3.4 కోట్లుగా చూపించారు.
ఇవి చదవండి: ముధోల్‌ బరిలో అన్నదమ్ముళ్లు! ఆసక్తిగా పరిశీలిస్తున్న ప్రజలు!

మరిన్ని వార్తలు