తమ్మీ.. నువ్వు జర తప్పుకోరాదె! నీకేం కావాలో చెప్పు ఇస్తా!!

14 Nov, 2023 10:25 IST|Sakshi

నామినేషన్ల ఉపసంహరణకు నేతల బేరసారాలు..

15కు మించితే రెండు ఈవీఎంలు వాడాల్సిందే!

అదే జరిగితే ఓటర్లు తికమకపడే అవకాశం..

రేపు తేలనున్న అభ్యర్థుల లెక్క!

సాక్షి, కరీంనగర్: 'అన్నా.. తమ్మీ.. నామినేషన్‌ వేశావు.. ఈ 15 రోజుల్లో ప్రచారం చేసి, నువ్వు గెలిచేది లేదు.. ఏ ఉద్దేశంతో నామినేషన్‌ వేశావో ఆ సమస్య అందరికీ తెలిసింది. ఇగ తప్పుకో.. ఇప్పటివరకు నువ్వు చేసిన ఖర్చుకు డబుల్‌ ఇస్తా. లేకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నీకు టిక్కెట్‌ ఇప్పించే బాధ్యత నాది. బరిలో ఉంటే రెండు ఈవీఎంలు వాడాల్సి వస్తుంది. అసలే మన నియోజకవర్గంలో గ్రామీణ ఓటర్లు ఎక్కువ.

ముసలోళ్లు, సదువురానోళ్లు ఈవీఎంలో నా పార్టీ గుర్తును గుర్తించేందుకు తికమకపడతారు. దీంతో ఓట్లు చీలే అవకాశం ఉంది.. అంటూ ప్రధాన పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచిన ఇండిపెండెంట్‌ అభ్యర్థులతో మంతనాలు సాగిస్తున్నారు. వారిని నామినేషన్‌ ఉపసంహరించుకునేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఏ మేరకు ఫలించనున్నాయో రేపు తేలనుంది.'

ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీల నేతలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఏ చిన్న విషయాన్నీ వదలకుండా వ్యూహ్యలు రచిస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక ఈవీఎంలో 16 గుర్తులు ఉండగా, అందులో చివరిది నోటాకు కేటాయిస్తారు. దీంతో బరిలో 15 మందికి మించితే రెండో ఈవీఎంను ఉపయోగించాల్సి ఉంటుంది.

అదే జరిగితే పోలింగ్‌ రోజు ఓటర్లు తికమకపడే అవకాశం ఉంది. అలాగే, అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో డమ్మీ ఈవీఎంలను చూపి, ఓటర్లకు వివరించడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో, పోటీలో 15 మందిలోపే ఉండేలా తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం పూర్తవగా, సోమవారం రిటర్నింగ్‌ అధికారులు వాటిని పరిశీలించారు.
ఇవి చదవండి: అప్పట్లో స్వతంత్రులదే హవా..! కానీ ఇప్పుడు..

మరిన్ని వార్తలు