వృద్ధుడి బలవన్మరణం

14 Nov, 2023 01:02 IST|Sakshi
స్టాక్‌ రిజిస్టర్‌ పరిశీలిస్తున్న సీఐ రమేశ్‌

ధర్మపురి: గిరిజన బోదరగూడెంకు చెందిన అద్దరి చిన్నన్న(80) బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడికి ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్యకు సంతానం కలగకపోవడంతో మరొకరిని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లున్నారు. చిన్నన్న గ్రామంలో కూలీ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. చిన్నన్నకు అదే గ్రామానికి చెందిన కొందరితో గొడవలున్నాయి. గొడవల్లో చిన్నన్నకు అవమానం జరగగా.. అది భరించలేక ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.

దంపతుల ఆత్మహత్యాయత్నం

భార్య మృతి

రామగిరి(మంథని): కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్ప డగా.. భార్య మృతిచెందింది. కల్వచర్ల పంచాయతీ ప్రశాంత్‌నగర్‌లో ఉప్పులూరి వీర్రాజు, వీర రాఘవమ్మ(55) దంపతులు కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీర్రాజు కొద్దికాలంగా మద్యానికి బానిస కావడంతో.. గొడవలు మొదలయ్యాయి. సోమవారం ఉదయం వీర్రాజు మద్యం తాగి వీర రాఘవమ్మతో గొడవ పడడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె పురుగుల మందు తాగింది. అనంతరం వీర్రాజు తాగాడు. గమనించిన స్థానికులు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో భార్య వీర రాఘవమ్మ మృతిచెందింది. మెరుగైన చికిత్స కోసం వీర్రాజును కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి ఇద్దరి కూతుళ్లకు వివాహమైంది. మృతురాలి కూతురు మద్దుకూరి లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కటిక రవిప్రసాద్‌ తెలిపారు.

మద్యం దుకాణాలపై కేసు

గోదావరిఖని(రామగుండం): ఎన్నికల కమి షన్‌కు సకాలంలో సేల్స్‌ వివరాలందించని రెండు మద్యం దుకాణాలపై కేసు నమోదు చేసినట్లు రామగుండం ఎకై ్సజ్‌ సీఐ సుంకరి రమేశ్‌ తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు ప్రతిరోజు రాత్రి 11 గంటల్లోపు ఆయా బ్రాందీషాపుల సేల్స్‌ వివరాలు పెట్టాలని అన్ని షాపులకు చెప్పినా.. యజమానులు పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. స్టాక్‌ రిజిస్టర్లు అందుబాటులో లేని యైటింక్లయిన్‌కాలనీకి చెందిన తెలంగాణ వైన్స్‌, గోదావరిఖని మార్కెట్‌ వద్ద గల దుర్గావైన్స్‌పై నాన్‌ మెయింటెనెన్స్‌ ఆఫ్‌ అకౌంట్‌ రిజిస్టర్‌ కేసు నమోదు చేసి రూ.15 వేల చొప్పున జరిమానా విధించామన్నారు.

బొగ్గు తరలిస్తున్న

లారీ పట్టివేత

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి శివారులో బొగ్గును అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకొని సింగరేణి కాంట్రాక్టర్‌ నరసింగరావు, డ్రైవర్‌ కార్తీక్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు. గోదావరిఖని 11బొగ్గు గని నుంచి రాఘవాపూర్‌ రైల్వే స్టేషన్‌కు బొగ్గును తరలించాల్సిన కాంట్రాక్టర్‌ నర్సింగరావు అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా.. రంగంపల్లి వద్ద సింగరేణి సెక్యూరిటీ జూనియర్‌ ఇన్స్‌పెక్టర్‌ ఉమేశ్‌, ఇతర సిబ్బంది పట్టుకున్నారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు