వైద్యం వికటించి వ్యక్తి మృతి

14 Nov, 2023 01:02 IST|Sakshi
రాజిరెడ్డి (ఫైల్‌)

శంకరపట్నం(మానకొండూర్‌): మండలంలోని లింగాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి స్థానిక ఆర్‌ఎంపీ అందించిన వైద్యం వికటించి, మృతిచెందాడని బాధిత కుటుంబసభ్యులు అన్నారు. ఈ మేరకు సదరు వైద్యుడి ఇంటి ఎదుట నిరసన తెలిపారు. మృతుడి సోదరుడు, పోలీసుల వివరాల ప్రకారం.. అంతం రాజిరెడ్డి(51) వారం రోజుల క్రితం పొలం పనులకు వెళ్లి, అనారోగ్యానికి గురయ్యాడు. గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లగా ఇంజక్షన్‌ వేసి, సైలెన్‌ పెట్టాడు. తర్వాత అతని శరీర రంగు మారింది. కుటుంబసభ్యులు హుటాహుటిన కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆర్‌ఎంపీ అందించిన వైద్యం వికటించడం వల్లే రాజిరెడ్డి మృతిచెందాడని కుటుంబసభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మృతదేహంతో సదరు వైద్యుడి ఇంటి ఎదుట బైఠాయించారు. కానీ, అంతకుముందే సదరు అతను పరారయ్యాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఆర్‌ఎంపీ ఇంటి ఎదుట మృతుడి కుటుంబసభ్యుల నిరసన

పరారీలో వైద్యుడు

మరిన్ని వార్తలు