మేం ఓటేస్తాం.. మీరూ వేయండి!

17 Nov, 2023 01:24 IST|Sakshi
అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ఓటరు కార్డు

అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ భార్య శ్వేతబన్నూరి

కరీంనగర్‌ అర్బన్‌: ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకుంటామని చెబుతున్నారు ఉన్నతాధికారులు. ఓటరు నమోదు ప్రక్రియలో విరివిగా ప్రచారం చేసిన జిల్లా ఉన్నతాధికారులు తామూ ఓటరుగా నమోదు చేసుకుని ఈనెల 30న ఓటేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎక్కడ పనిచేసినా.. ప్రాంతమేదైనా.. భాష ఏదైనా ఓటరుగా నమోదు చేసుకోవడం, ఎన్నికల్లో ఓటేయడం తమ అభిమతమని చాటుతున్నారు. కలెక్టర్‌ పమేలా సత్పతి, పోలీస్‌ కమిషనర్‌ అభిషేక్‌ మహంతి, వారి కుటుంబసభ్యులు ఇక్కడే ఓటేయనున్నారు. ఓటర్లుగా ఉన్న మనం కూడా ఎన్నికల రోజున పోలింగ్‌ కేంద్రానికి తరలుదాం.. సిద్ధమే కదా!!

కుటుంబసభ్యులు సహా..

కలెక్టర్‌ పమేలా సత్పతి ఓటు హక్కు పొందడంతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఓటు హక్కు పొందారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన పమేలా సత్పతి ఎక్కడ విధులు నిర్వహించినా ఆ ప్రాంతంలోనే ఓటు హక్కు పొందుతున్నారు. వేరే జిల్లాకు బదిలీ అయినప్పుడు ఓటును రద్దు చేసుకుని కొత్త ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకుంటున్నారు. అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ది కర్నాటక రాష్ట్రం కాగా ఇక్కడే ఓటరుగా నమోదు చేసుకున్నారు. అతని భార్య శ్వేతబన్నూరి కూడ ఓటరుగా నమోదు చేసుకున్నారు. పోలీస్‌ కమిషనర్‌ అభిషేక్‌ మహంతి పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో అయినా తండ్రిది ఒడిశా రాష్ట్రం. కాగా ఓటరుగా ఎక్కడుంటే అక్కడ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు.

వీళ్లకి అరుదైన అవకాశం

ఉన్నతాధికారులకు ఓటుహక్కు కల్పించే అవకాశం బీఎల్‌వోలకు లభించింది. 118 పోలింగ్‌ కేంద్రంలో కలెక్టర్‌ ఓటరుగా నమోదు చేసుకోగా, పోలీస్‌ కమిషనర్‌ అభిషేక్‌ మహంతి ఓటు 117 పోలింగ్‌ కేంద్రంలో ఉండగా బీఎల్‌వో ఎం.రమ్య క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. క్యాంపు కార్యాలయానికి వెళ్లి వివరాలను నమోదు చేసుకుని ఓటరు జాబితాలో పేరు చేర్చగా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయానికి వెళ్లి మాట్లాడే అవకాశం లభించడం చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ క్వార్టర్స్‌ 120 పోలింగ్‌ కేంద్రంలో ఉండగా అదనపు కలెక్టర్లు లక్ష్మీకిరణ్‌, ప్రఫుల్‌ దేశాాయ్‌, జిల్లా రెవెన్యూ అధికారి, కరీంనగర్‌ ఆర్డీవోల ఓటరు దరఖాస్తులను మల్లీశ్వరి పరిశీలించి ఓటరు జాబితాలో చేర్చారు.

ఎక్కడెక్కడ ఓటేయనున్నారంటే..

కలెక్టర్‌ పమేలా సత్పతి పోలింగ్‌కేంద్రం సంఖ్య 146 మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

పోలీస్‌ కమిషనర్‌ అభిషేక్‌ మహంతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని 146 పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయనున్నారు.

అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, అతని భార్య శ్వేతబన్నూరి, అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌, జిల్లా రెవెన్యూ అధికారి పవన్‌కుమార్‌, కరీంనగర్‌ ఆర్డీవో కుందారపు మహేఽశ్వర్‌ కుటుంబీకులు జిల్లా ప్రజాపరిషత్‌లోని 149వ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించనున్నారు.

ఓటుకు రెడీ అంటున్న ఉన్నతాధికారులు

కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు ఇక్కడే నమోదు

ప్రాంతమేదైనా ఓటేసేందుకు సిద్ధం

మరిన్ని వార్తలు