అపు‘రూప’ నేతకారుడు

3 Dec, 2023 00:36 IST|Sakshi

సిరిసిల్ల : కోటి భావాలను ఆయన చిత్రాలు ఆవిష్కరిస్తాయి. ఎన్నెన్నో ఊహాలను, ఊసులను పంచుతాయి. ఒక్క క్షణం మనల్ని ఊహాలోకంలోకి తీసుకెళ్లాయి. కన్నీళ్లు పెట్టిస్థాయి, నవ్వులు పుట్టిస్తాయి. సిరిసిల్ల సుందరయ్యనగర్‌ నేత కార్మిక కుటుంబానికి చెందిన వెంగళ గణేశ్‌ చిత్రకారుడిగా అద్భుతమైన చిత్రాలను వేశారు. రంగులతో బొమ్మలేస్తూ.. అబ్బుర పరిచే అపు‘రూపాల’ను ఆవిష్కరించారు. వెంగళ గణేశ్‌ చిత్రకళపై కథనమిది..

నేతన్నల బతుకులపై..

రాత్‌ పైలీ, దిన్‌ పైలీ(రేయింబవళ్లు) మరమగ్గాల మధ్య శ్రమించిన నేత కార్మికుడు బతుకుదెరువు లేక ఆ మగ్గాల మధ్యే నూలుపోగుల్ని ఉరితాళ్లు చేసుకున్న నేతన్న దుస్థితిని తన చిత్రంలో ఆవిష్కరించారు గణేశ్‌. తెలంగాణపల్లె పడచుల అందాల్ని.. పిల్లల ఆటలను, ప్రాంతీయ అసమానతలను ఎలిగెత్తిచాటారు. ప్రకృతి రమణీయత చిత్రాలతోపాటు సందేశాత్మక బొమ్మలను వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. చిన్నారులు వాగులో ఇసుకతో పిట్టగూళ్ల ఆటను.. మూటాముల్లె చంకలో పాపతో వెళ్లే పల్లెపడచు చిత్రాన్ని హృదయాలనత్తుకునేలా తీర్చిదిద్దారు. వందలాది చిత్రాలతో గణేశ్‌ చిత్రకారుడిగా గుర్తింపు సాధించారు.

సామాజిక ఉద్యమానికి బాసట

గణేశ్‌ తన చిత్రాలతో సామాజిక ఉద్యమాలకు బాసటగా నిలుస్తున్నాడు. వంద చిత్రాలతో శ్రీకృష్ణ కమిటీకి చిత్రనివేదన చేసి తెలంగాణ ఆకాంక్షను చాటుకున్నాడు. అంతకుముందు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం పదకొండు అడుగుల భారీ చిత్రాన్ని గణేశ్‌ తీర్చిదిద్దారు. ఎయిడ్స్‌, పర్యావరణ పరిరక్షణ, నేతన్నల ఆత్మహత్యలు, ముంబయిలో ఉగ్రవాదుల దాడులు లాంటి సమకాలిన సామాజికాంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సృజనాత్మకంగా చిత్రాలు వేస్తూ జిల్లా స్థాయిలో గ్రామీణ కళాజ్యోతి అవార్డు, కళాసేవ పురస్కారాన్ని అందుకున్నారు.

సిరిసిల్ల చిత్రకారుడి సజీవ చిత్రాలు

అనుభూతులు.. అపురూపాలు..

అద్భుత చిత్రాలను ఆవిష్కరించిన వెంగళ గణేశ్‌

ఆసక్తితో చిత్రాలు వేస్తాను..

నాకు బొమ్మలు వేయడం చాలా ఇష్టం. ఆ ఆసక్తితోనే చిత్రాలు వేస్తాను. రంగులతో బొమ్మలు వేసే చిత్రకారులకు ఒక వేదిక లేదు. ఆర్ట్‌గ్యాలరీ ఉంటే చిత్రకారులకు మార్కెటింగ్‌ సౌకర్యం ఉంటుంది. మరింత మంది కళాకారులు తమ చిత్రనైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉపాధి పొందుతారు. ఆర్ట్‌ గ్యాలరీ స్థాపించాలని ఉంది. ఈ రంగంలో ఆసక్తి గల యువకులకు, చిత్రకళలలో శిక్షణ ఇస్తాను.

– వెంగళ గణేశ్‌, చిత్రకారుడు, సిరిసిల్ల.

మరిన్ని వార్తలు