కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

3 Dec, 2023 00:36 IST|Sakshi
బాలుడి తలపై గాయం

గన్నేరువరం(మానకొండూర్‌): మండలంలోని మాదాపూర్‌లో శనివారం కుక్కల దాడి చేయగా ఓ బాలుడికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. నౌండ్ల శంకర్‌–శిరీష దంపతుల కుమారుడు 13 నెలల అన్విత్‌ ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. కుటుంబసభ్యులు ఇంట్లో సామగ్రి సర్దే పనిలో ఉన్నారు. ఒక్కసారిగా చిన్నారి ఏడుపు విని, శిరీష బయటకు వచ్చింది. కుక్కలు అన్విత్‌ను లాక్కెళ్తుండటం చూసి, వెంటనే వాటిని తరిమింది. బాబు తలపై గాయాలైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

శతాధిక వృద్ధురాలి మృతి

రామడుగు(చొప్పదండి): మండలంలోని వెదిర గ్రామానికి చెందిన పన్యాల భూమవ్వ(102) మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె శనివారం ఉదయం చనిపోయినట్లు పేర్కొన్నారు. భూమవ్వకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు

పాలకుర్తి(రామగుండం): రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకుర్తి మండలంలోని ఈసాలతక్కళ్లపల్లికి చెందిన పెసరి నవీన్‌ తన భార్య సమతను శనివారం బైక్‌పై ఆస్పత్రికి తీసుకెళ్తున్నాడు. పాలకుర్తి శివారులో ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టి, సమీపంలోని చెట్టుకు తగిలి ఆగిపోయింది. వెంటనే కారులోని ఎయిర్‌ బెలూన్స్‌ తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. నవీన్‌, సమతలకు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా, సంఘటన స్థలం మూలమలుపు కావడం, రోడ్డును ఆనుకొని వ్యవసాయ బావి, చెట్ల పొదలు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని వాహనదారులు తెలిపారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, చెట్ల పొదలు తొలగించి, సైన్‌బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు