వ్యాపారంలో నష్టం రావడంతో ఒకరు..

3 Dec, 2023 00:36 IST|Sakshi
బాధితుడికి ప్రథమ చికిత్స అందిస్తున్న 108 సిబ్బంది

కుటుంబ కలహాలతో వ్యక్తి..

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): మండలంలోని గంగారం పంచాయతీ పరిధి ఊశన్నపల్లెకు చెందిన ముష్కె మల్ల య్య(50) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాల కారణంగా మల్లయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి, చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నాడు. మృతుడికి భార్య స్వరూప, కుమారుడు, కూతురు ఉన్నారు.

వ్యాపారంలో నష్టం రావడంతో ఒకరు..

కోనరావుపేట(వేములవాడ): మేకల వ్యాపారంలో ఓ వ్యక్తి నష్టపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. సిరిసిల్ల పరిధిలోని చిన్నబోనాలకు చెందిన ముద్దం రాములుయాదవ్‌ (55) గత 30 సంవత్సరాలుగా మేకల వ్యాపారం చేశాడు. ఇటీవల వ్యాపారంలో రూ.5 లక్షల మేర నష్టం వచ్చింది. దీంతో కొద్దిరోజులుగా మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 1న బయటకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. శుక్రవారం సాయంత్రం మండలంలోని కొలనూర్‌ శివారులో చెట్టుకు ఉరేసుకొని కనిపించగా, రైతులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై శ్రీనివాస్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య నర్సవ్వ ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు. రాములుయాదవ్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.

నేతకానిపల్లిలో వివాహిత..

ఎలిగేడు(పెద్దపల్లి): మండలంలో ధూళికట్ట అనుబంధ గ్రామం నేతకానిపల్లిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. జూలపల్లి ఎస్‌ఐ వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్‌ మండలంలోని బాలయ్యపల్లికి చెందిన గోదారి వెంకటయ్య చిన్న కూతురు చంద్రకళను నేతకానిపల్లికి చెందిన దుర్గం శ్రీనివాస్‌కు ఇచ్చి, ఐదేళ్ల క్రితం వివాహం జరిపించారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు హర్ష, హిందు సంతానం. చంద్రకళకు వెన్నుపూస సమస్యతో బాధ పడుతుండటంతో శ్రీనివాస్‌ వివిధ ఆస్పత్రుల్లో చూపించాడు. మందులు వాడినా ఫలితం లేకపోవడంతో తీవ్రమైన నొప్పితో బాధ పడుతుండేది. ఏ పనీ చేయలేక ఇంటివద్దే ఉండేది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది, శనివారం మధ్యాహ్నం ఇంట్లోనే ఉరేసుకుంది. చంద్రకళ మృతి విషయంలో ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు