ఇం‘ధనం’ @ రూ.7.20కోట్లు

3 Dec, 2023 00:50 IST|Sakshi
● అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా వినియోగం ● నెల రోజుల్లో 10లక్షల లీటర్లు ఖర్చు ● అభ్యర్థులకు తడిసిమోపెడు

కరీంనగర్‌ అర్బన్‌: అసెంబ్లీ ఎన్నికల్లో కోట్ల ఇంధనం ఖర్చయింది. ర్యాలీలు, సభలు, రోడ్‌షోలు, బైక్‌ర్యాలీ, రోజువారీ ప్రచారం క్రమంలో అభ్యర్థులకు ఇంధన ఖర్చు తడిసిమోపైడెంది. తమ ప్రచార వాహనాలు కదలాలంటే డీజిల్‌, పెట్రోల్‌ తప్పనిసరి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల క్రమంలో అభ్యర్థులు బేజారయ్యారు. షెడ్యూల్‌ అక్టోబర్‌ 9న విడుదలవగా నవంబర్‌ 3నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. అక్టోబర్‌ 11 నుంచే పార్టీల కార్యక్రమాలు ఊపందుకోగా 53రోజుల పాటు ప్రచారం, పార్టీల సమావేశాలు జరగగా వాహన శ్రేణి తప్పనిసరి. వాహనాలంటేనే ఇంధన ధరలపై ఆలోచించాల్సి వచ్చిందని ఓ పార్టీ అభ్యర్థి ‘సాక్షి’తో వాపోయారు.

ప్రచారమంటేనే భారీ ఖర్చు

జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో 10,59,215 మంది ఓటర్లున్నారు. ప్రతి ఓటరును కలిసేలా అభ్యర్థులు రూట్‌ మ్యాపు సిద్ధం చేసుకోగా తదనుగుణంగా ప్రచారం నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గంలో అన్ని గ్రామాలను కలియతిరుగుతూ 50కిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రోజువారీగా ఒక్కో వాహనం వంద కిలోమీటర్లు లెక్కకట్టినా ఇంధనానికి రూ.550వరకు ఖర్చవుతోంది. ఇలా ఒక్కో అభ్యర్థికి సంబంధించి ప్రచారం, అనుచరులకు సంబంధించి 20వాహనాలైనా 11వేల వరకు ఇంధనానికి ఖర్చవుతోంది. డ్రైవర్‌ బస్తా, కిరాయి అదనం. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అభ్యర్థి గరిష్ట వ్యయం రూ.30.80లక్షలు మాత్రమే. దీంతో ఇంధన ధరల క్రమంలో అచితూచి వ్యవహరించారు.

బహిరంగ సభలు.. ఇన్‌చార్జిల ఖర్చు అదనం

అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోగా కాకలు తీరిన నేతలు ప్రచారంలో భాగస్వాములయ్యారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే పార్టీల అధినేతలు, ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ అగ్రనేతలు, ఇతర రాష్ట్రా ల సీఎంలు భారీ బహిరంగ సభలు నిర్వహించారు. స్టార్‌ కాంపెయినర్లు 70 మంది వరకు ఉండగా వంద ఓటర్లకో ఇన్‌చార్జి ఉన్నారు. వీరంతా రాకపోకలు సాగించేందుకు వాహనాలకు ఇంధన వినియోగం తప్పనిసరి. దీంతో పాటు రోజువారీ ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలకు ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్‌ అదనపు భారం. ఈ క్రమంలో వేల లీటర్లలో ఇంధనం వినియోగించారు. మొత్తం ఎన్నికల ప్రచారంలో ఇంధనానికే రూ.కోట్లలో ఖర్చు కావడం రవాణా ప్రాధాన్యం చాటుతోంది.

ఇంధన వినియోగమిలా..

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల: అక్టోబర్‌ 9

పోలింగ్‌కు నవంబర్‌ 30వరకు గల రోజులు: 53

జిల్లాలో మొత్తం పెట్రోల్‌ బంకులు: 52

ఎన్నికలకు ముందు రోజువారీ

వినియోగం: 76వేల లీటర్లు

ప్రచారంతో వినియోగం:

2,12,000 లీటర్లు

అదనపు వినియోగం: 1,36,000 లీటర్లు

అదనపు వినియోగంతో రోజు ఖర్చు: రూ.13.60లక్షలు

ఎన్నికల్లో మొత్తం ఖర్చు(అంచనా): రూ.7.20కోట్లు

మరిన్ని వార్తలు