లెక్కింపులో సమస్య ఉంటే వీవీప్యాట్లే కీలకం

3 Dec, 2023 00:50 IST|Sakshi
● ఇబ్బందులుంటే వినియోగించుకొనే వెసులుబాటు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఎన్నికల్లో చివరి ఘట్టం ఓట్ల లెక్కింపు. ఈ సమయంలో ఈవీఎంలలో సమస్య వస్తే వీవీప్యాట్లే కీలకం. గత నెల 30న పోలింగ్‌తో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈమేరకు ఎస్సారార్‌ కళాశాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పారదర్శక ఎన్నికలకు వీవీప్యాట్లు

ఎన్నికల్లో పారదర్శకతను పెంచడంతోపాటు ఓటర్ల నమ్మకాన్ని చూరగొనేందుకు ఎన్నికల సంఘం 2014 నాటి ఎన్నికల్లో వీవీప్యాట్లను అందుబాటులోకి తెచ్చింది. ఓటు వేయగానే కాగితంపై ఏ గుర్తుకు ఓటు వేశారో వీవీప్యాట్‌ తెరపై 7 సెకన్ల పాటు కనిపిస్తుంది. దీంతో ఓటరు తన ఓటు ఎవరికి పడిందోననే సందేహం కలగకుండా ఉంటుంది. ఈవీఎంలు మొరాయించడం, ఇతర సమస్యలు తలెత్తిన సమయంలో వీవీప్యాట్లలో భద్రపరచి ఉన్న చీటీలను లెక్కించి సమస్యను పరిష్కరిస్తారు. నియోజకవర్గంలో 5 వీవీ ప్యాట్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసుకొని లెక్కిస్తారు. ఈవీఎంల ద్వారా వచ్చిన ఫలితం, వీవీప్యాట్స్‌ ద్వారా వచ్చిన ఫలితాన్ని సరిచూసుకొని ఆర్వో తుది ఫలితాన్ని ప్రకటిస్తారు.

ఈవీఎంలు మొరాయించినా..

ఒక్కో ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల వివరాలను సాధారణంగా లెక్కించేందుకు గరిష్టంగా రెండు నిమిషాల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈవీఎంలు మొరాయిస్తే ఆగ్జిలరీ యూని ట్‌ ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలుసుకునే అవకాశం ఉంది. ఇది సాధ్యం కాకపోతే వీవీప్యాట్‌ చీటీలను లెక్కించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఎక్కడైనా మెజార్జీ స్వల్పంగా ఉన్నప్పుడు వీవీప్యాట్‌ లను లెక్కించాలని అభ్యర్థులు పట్టుపడితే విషయాన్ని స్థానిక అధికారులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో తదుపరి చర్యలు తీసుకుంటారు.

మరిన్ని వార్తలు