అత్త‌గారింటికొచ్చి, అనుమానాస్పదంగా చెరువులో శ‌వ‌మై..

7 Dec, 2023 11:21 IST|Sakshi

సాక్షి, కరీంనగర్: వెల్గటూర్‌ మండలకేంద్రంలోని పెద్దవాగులో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన నస్పూరి రాజేందర్‌ (42)కు మండలకేంద్రానికి చెందిన పుట్టపాక శంకరమ్మ–కిష్టయ్య కూతురు స్రవంతితో 15 ఏళ్లక్రితం వివాహం జరిగింది.

రజక కులానికి చెందిన రాజేందర్‌ శుభకార్యాలకు వంట పనులు చేస్తుంటాడు. మంగళవారం ఉదయం పనినిమిత్తం వెల్గటూర్‌లోని తన అత్తగారింటికి వచ్చాడు. ఓ శుభకార్యంలో మేకలు కోసేందుకు వెళ్లి రాత్రయినా ఇంటికి రాలేదు. దీంతో బావమరిది పుట్టపాక జయందర్‌ మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదైంది. బుధవారం ఉదయం రాజేందర్‌ మృతదేహం వెల్గటూర్‌లో పెద్దవాగులో లభ్యమైంది.

అయితే రాజేందర్‌ మంగళవారం సాయంత్రం రాజక్కపల్లిలోని ధర్మాజి సత్యం ఇంటికి వెళ్లాడని, అక్కడ గొడవ జరగడంతో పారిపోతుండగా పెద్దవాగులో ఈదుకుంటూ వెళ్లి మునిగిపోయినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో రాజేందర్‌ మృతిపై ధర్మాజి సత్యం, ధర్మాజి గంగారాంపై అనుమానాలున్నాయని జయంధర్‌ ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్వేత పేర్కొన్నారు.
ఇవి కూడా చ‌ద‌వండి: నా కొడుకుది ప్ర‌మాదం కాదు, కావాల‌నే ఇలా చేశారు!

>
మరిన్ని వార్తలు