పెళ్లి చేసుకోమంటే.. అంతు చూశాడు.. ఎయిర్‌హోస్టెస్‌ మృతి కేసులో వీడిన మిస్టరీ

15 Mar, 2023 05:28 IST|Sakshi

బనశంకరి: డేటింగ్‌ యాప్‌ ద్వారా మొదలైన ప్రణయం ఆమె పాలిట ప్రాణాంతకంగా మారింది. కోరమంగలలో 4 వ అంతస్తుపై నుంచి పడి ఎయిర్‌హోస్టెస్‌ మృతి చెందిన ఘటన లో మంగళూరు కు చెందిన ఆమె ప్రియుడు ఆదేశ్‌ను మంగళవారం కోరమంగళ పోలీసులు అరెస్ట్‌చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన అర్చనా దీమన్‌ (28) మృతురాలు. కోరమంగల 8 వ బ్లాక్‌ రేణుకారెసిడెన్సీ అపార్టుమెంట్‌ 4 వ అంతస్తులో శుక్రవారం అర్ధరాత్రి ఆమె పై నుంచి కిందపడడంతో మరణించింది.

వివరాలు.. అర్చన ఒక అంతర్జాతీయ విమానయాన కంపెనీలో ఎయిర్‌హోస్టస్‌గా పనిచేసేది, ఆమె ప్రియుడు ఆదేశ్‌ బెంగళూరులో టెక్కీ. ఆరునెలల క్రితం డేటింగ్‌యాప్‌లో ఇద్దరికీ పరిచయం కుదిరింది, ఇది కాస్తా స్నేహంగా మారి ప్రేమకు దారితీసింది. ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలని అర్చన నిర్ణయించింది. దుబాయ్‌లో ఉన్న అర్చనా కొన్నిరోజుల కిందట బెంగళూరుకు చేరుకుంది.

నాలుగురోజుల పాటు ఇద్దరూ కలిసి ఉన్నారు. ఫోరం మాల్‌లో సినిమా చూసుకుని ఆదేశ్‌ ఫ్లాట్‌కు వచ్చారు. ఇద్దరూ మద్యం పార్టీ చేసుకున్నారు, పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తీసుకురాగా, ఆదేశ్‌ అంగీకరించలేదు. దీంతో గొడవ జరిగింది. మద్యం మత్తులో బిల్డింగ్‌ పై నుంచి కిందపడిందని మృతురాలి తండ్రికి ఆదేశ్‌ ఫోన్‌చేశాడు. పోలీసులకు కూడా ఇదే చెప్పాడు.

పెళ్లి కోసం వేధించిందని వాంగ్మూలం
ఆదేశ్‌, అర్చనాను బిల్డింగ్‌ పై నుంచి తోసేశాడని ఆమె తండ్రి దేవరాజ్‌ కోరమంగల పోలీస్‌స్టేషన్‌లో ిఫిర్యాదు చేశాడు. ఆదేశ్‌ను పోలీసులు అరెస్ట్‌చేసి తమదైనశైలిలో విచారించగా, ఆమెను తానే తోసేసినట్లు ఒప్పుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని మూడునెలలుగా అర్చనా పీడిస్తోందని, మరోవైపు ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పాడు. 11వ తేదీ రాత్రి ఇదే గొడవ తీవ్రస్థాయికి చేరింది, నన్ను పెళ్లి చేసుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆదేశ్‌, అర్చనా ను బిల్డింగ్‌ పై నుంచి కిందికి తోసేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.

మరిన్ని వార్తలు