పట్టుదలే అతని చూపు

21 Mar, 2023 01:30 IST|Sakshi

కర్ణాటక: పుట్టుకతోనే అంధత్వం, ఆపై నిరుపేద కుటుంబం. ఈ అడ్డంకులను, అవమానాలను తట్టుకుని జీవితంలో ఒక దశకు చేరుకున్నాడు. విద్యను వెలుగుగా చేసుకొని మరింత ఉన్నత లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నాడు. ఆయనే సిద్ధు ఎస్‌. లౌటి. గణితంలో ప్రతిభ సాధించి సూపర్‌ కంప్యూటర్‌గా ఆయన పేరు గడించాడు.

కుగ్రామం నుంచి ప్రస్థానం
బెళగావి జిల్లా అథణి తాలూకా కక్కమరి అనే చిన్న గ్రామంలో బడుగు కుటుంబంలో రెండో సంతానంగా జన్మించాడు. పుట్టుకతోనే అంధునిగా జన్మించడంతో ఏది వెలుగు, ఏది చీకటి, మానవ, పశుపక్ష్యాదులు ఎలా ఉంటాయో కూడా ఊహించుకోలేడు. సిద్ధుకు ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులు ప్రభుత్వ హాస్టల్‌లో విడిచిపెట్టారు. ఎవరు అతన్ని పట్టించుకొనేవారు కాదు. చాలా బలహీనంగా ఉండేవాడు. 1వ తరగతి చదవుతున్న సమయంలో అందరూ గేలి చేసేవారు. అదే పాఠశాలలో ఓ 7వ తరగతి విద్యార్థి 100 వరకు గుణింతాలు చెప్పేవాడు, ఉపాధ్యాయులు, అధికారులు అతనిని చాలా గౌరవించేవారు. తాను కూడా ఇలా ఎందుకు కారాదని 2వ తరగతి చదవుతున్నప్పుడే 56 లక్షల వరకు గుణింతాలను నేర్చుకొన్నాడు. దీంతో పాఠశాలలో సిబ్బంది సిద్దు ప్రతిభను గుర్తించారు. ఆయా సంఘ సంస్థలు చేసే కార్యక్రమాల్లో ప్రతిభను ప్రదర్శింపజేశారు. ఇందుకు ప్రతిభా పురస్కారం, నగదు బహుమతి లభించేది. కానీ సిద్ధూను ఆ ప్రదర్శనకు తీసుకువచ్చేవారు ఆ నగదు, బహుమానాలను కొట్టేసేవారు.

ప్రస్తుతం ఎల్‌ఎల్‌బీ పూర్తి
బెళగావిలో ఎస్‌ఎస్‌ఎల్‌సీలో 80 శాతం మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. 10వ తరగతి వరకు కన్నడ పాఠశాలల్లోనే విద్యను అభ్యాసించాను. ఆ తరువాత ఇంగ్లిషు నేర్చుకోవాలని బెంగళూరుకు చేరుకొన్నాడు. మూడు రోజుల పాటు భోజనం లేకుండా ఫుట్‌పాత్‌పైనే ఉండిపోయాడు. జేబులో ఒక్క రూపాయి మాత్రం ఉంది. చివరకు ఎలాగో ఓ స్కూల్లో సీటు వచ్చింది. ప్రథమ శ్రేణి మార్కులతో పీయూసీలో ఉత్తీర్ణులయ్యాడు. తరువాత బెంగళూరులో ఓ కాలేజీవారు ఉచితంగా ఎల్‌ఎల్‌బీ సీటు ఇచ్చారు. ఐఏఎస్‌ అధికారి కావాలనే లక్ష్యంతో చదువుతూ న్యాయ విద్యను పూర్తిచేశాడు. ఐఏఎస్‌ అధికారిని తప్పకుండా అవుతానని సిద్ధు ఆత్మవిశ్వాసంతో చెప్పాడు.

సివిల్స్‌కు సహాయం చేయండి
35 ఏళ్ల సిద్ధు తదుపరి లక్ష్యం ఒకటి ఉంది.. అదే సివిల్స్‌ పరీక్షలు రాసి ఐఏఎస్‌కు ఎంపిక కావడం. ఇందుకు విస్తృతంగా చదవాల్సి ఉంటుంది. సిద్ధుకు ఆడియో బుక్స్‌ అవసరం. ఇంకా కొన్ని డివైస్‌లు కావాల్సి ఉన్నాయి. వాటిని అమెరికా నుంచి తెప్పించాల్సి ఉంది. అంత ఆర్థిక శక్తి తనకు లేదని, దాతలు, ప్రభుత్వం సహాయం చేసి ఆదుకోవాలని ఆయన కోరారు.

లెక్కల్లో అపార నైపుణ్యం
సిద్ధు ప్రస్తుతం 99 కోట్ల వరకు గుణింతాలు తడబడకుండా చెప్పగలడు. సిద్ధుకున్న గణిత జ్ఞానం అమోఘమైనది. ఎవరైనా పుట్టిన తేదీ చెబితే ఆ రోజు వారమేమిటి అనేది టక్కున చెబుతాడు. ఫలానా సంవత్సరం, నెలలో తేదీని చెబితే వారం చెప్పేస్తాడు.

ఒకటీ రెండూ కాదు ఏకంగా 45 వేల మొబైల్‌ఫోన్‌ నంబర్లను మనసులో గుర్తుపెట్టుకున్నట్లు తెలిపాడు. సాధారణ మానవులు 20 మొబైల్‌ నంబర్లను గుర్తుపెట్టుకుంటే చాలా గొప్పే.

ఇదే కాకుండా పుట్టినతేదీ, పేరు చెబితే జ్యోతిష్యం చెబుతారు. మానసిక కౌన్సెలింగ్‌లో నైపుణ్యం ఉంది. పలు టీవీ షోలలో పాల్గొనడంతో పాటు ఎద్దేళు మంజునాథ అనే కన్నడ సినిమాలోనూ నటించాడు. ఆయన ప్రతిభను మెచ్చి అనేక సంస్థలు అవార్డులతో సత్కరించాయి.

మరిన్ని వార్తలు