భర్తను వదిలి పెట్టి ప్రియునితో కాపురం పెట్టిన భార్య...

22 Mar, 2023 02:02 IST|Sakshi

బనశంకరి: తనను వదిలిపెట్టి, ప్రియునితో కాపురం పెట్టిన భార్యను భర్త గొంతుకోసి హత్యచేసి, రెండున్నర ఏళ్లు పసికందును చాకుతో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన బెంగళూరులో హెణ్ణూరుపోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చి
వివరాలు.. కోల్‌కతాకు చెందిన తబ్సీన్‌ బేబి (32) హతురాలు.14 ఏళ్ల క్రితం టైలరింగ్‌ పనిచేసే షేక్‌ సుహేల్‌ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లయింది. అతనిది కూడా కోల్‌కతానే. తరువాత బతుకుతెరువు కోసం బెంగళూరు నగరానికి చేరుకుని కేజీ.హళ్లిలో నివాసం ఉంటున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు. తబ్సీన్‌ బేబీకి ఒక ట్యాక్సీ డ్రైవరుతో సంబంధం ఉన్నట్లు భర్తకు తెలిసింది. భార్య ప్రవర్తనతో విరక్తి చెందిన షేక్‌ సుహేల్‌ 6 ఏళ్ల క్రితం ఇంటిని ఖాళీచేసి కుటుంబసమేతంగా కోల్‌కతాకు వెళ్లిపోయాడు. అక్కడ 6 నెలలు మాత్రమే ఉన్న తబ్సీన్‌బేబి ఓ రోజు భర్తను వదిలిపెట్టి రహస్యంగా బెంగళూరుకు చేరుకుంది. ప్రియునితో కలిసి సారాయిపాళ్య అఫీజా లేఔట్‌లో నివసిస్తోంది. వీరికి రెండున్నర ఏళ్లు కుమారుడు ఉన్నారు.

ఇంటి వద్ద గొడవపడి దాడి
అప్పటి నుంచి భార్యపై పగ పెంచుకున్న షేక్‌ సుహేల్‌ కోల్‌కతా నుంచి బెంగళూరుకు సోమవారం అర్ధరాత్రి వచ్చాడు. భార్య తబ్సీన్‌ బేబీ ఇంటి వద్దకు వెళ్లి ఆమెతో గొడవపడ్డాడు. అతడు తనతో పాటు కోల్‌కతాకు తిరిగి రావాలని కోరగా, ఆమె తిరస్కరించింది. కోపోద్రిక్తుడైన షేక్‌సుహేల్‌, ఆమె గొంతుపై కత్తితో పొడిచి హత్యచేశాడు. ఆపై బాలుని తొడపై పొడిచి పరారయ్యాడు. హెణ్ణూరు పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని తబ్సీన్‌ మృతదేహాన్ని అంబేడ్కర్‌ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన బాలుడిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడు షేక్‌సుహేల్‌ ను అరెస్ట్‌చేసి విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు