అధ్యక్షుడిగా ఏకగ్రీవం

22 Mar, 2023 02:02 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న సొత్తుతో పోలీసులు

బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధి ఆనేకల్‌ తాలూకా బిదరగుప్పె పంచాయతీ నూతన అధ్యక్షుడిగా ఇండ్లబెలె శివకుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని బమూల్‌ డైరెక్టర్‌ అంజినప్ప, బీజేపీ నాయకులు మధుకుమార్‌, బీబీఐ మునిరెడ్డి, బసవరాజు తదితరులు అభినందించారు.

సెంట్రల్‌ జైలులో గంజాయి స్వాధీనం

మైసూరు: మైసూరు సెంట్రల్‌ జైలుపై మంగళవారం పోలీసులు దాడి చేసి నగదు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మైసూరు నగర సీపీ రమేశ్‌ ఆదేశాల మేరకు డీసీపీ ముత్తురాజ, ఎస్‌ఐ జాహ్నవి నేతృత్వంలో పోలీసులు జైలులోని పలు బ్యారక్‌లలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా కొంత నగదు, అరకేజీ గంజాయి, బీడీలు, సిగరె ట్లు, మొబైల్‌ పౌచ్‌లు బయటపడ్డాయి.

చోరుల ముఠా ఆటకట్టు

శివమొగ్గ: ఒకే వ్యక్తి ఇంట్లో మూడుసార్లు దోపిడీ చేసిన కేసులో ఆరుగురు దోపిడీ దొంగలను అరెస్టు చేశారు. శివమొగ్గ నగరంలోని కాశిపుర లేఔట్‌కు చెందిన రాజు, హొసమెనె ఈశ్వర్‌, రాజు గున్న, శరావతినగర మణికంఠ , బొమ్మనకట్టి విజయ్‌, హొసమనె రఘును వినోభానగర పోలీసులు అరెస్టు చేశారు. వీరిపైన రెండు దోపిడీ కేసులు, ఒక మోసం కేసు ఉన్నాయి. బాధిత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నారు. బాధితుని ఇంటిలో మూడుసార్లు వీరు దొంగతనాలకు పాల్పడి డబ్బు, నగలను ఎత్తుకెళ్లారు. నిందితుల నుంచి కొంత డబ్బు, విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

అభివృద్ధి పనులకు భూమిపూజ

బొమ్మనహళ్లి: నగరంలోని బొమ్మనహళ్లి పరిధి మంగమ్మపాళ్య వార్డు సామసంద్రపాళ్య గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్‌ ఎం.సతీష్‌ రెడ్డి రోడ్డు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు. గ్రామంలో ఉన్న మెయిన్‌ రోడ్లకు డాంబర్‌ రోడ్డు, క్రాస్‌ రోడ్లకు సీసీ రోడ్డు, అండర్‌ డ్రైనేజీ పనులు చేపడుతారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో సమాజ సేవకుడు శ్రీసాయిరామ్‌ విద్యాసంస్థల అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి, బీజేపీ నాయకుడు మురళీధర్‌ రెడ్డి, సంతోష్‌, నవీన్‌, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

అడవి జింకను వేటాడిన వ్యక్తి అరెస్ట్‌

మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలె మహాదేశ్వర వన్య జీవుల అటవీ ప్రాంతంలో జింకను వేటాడి దాని మాంసాన్ని విక్రయానికి ఉంచిన వ్యక్తిని అటవీ అధికారులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు మారుశెట్టి, తన సహచరులు రాము, మూర్తిలు పాలార్‌హళ్లిలో జింకను చంపి దాని మాంసాన్ని విక్రయిస్తుండగా సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి మారుశెట్టిని అరెస్ట్‌ చేయగా సహచరులు పారిపోయారు. వారి కోసం గాలిస్తున్నారు.

పులి కూన మృతి

మైసూరు: రెండు పులులు దాడులు చేసుకున్న ఘటనలో ఒక పులి కూన మృతి చెందిన ఘటన మైసూరు జిల్లా హెచ్‌డీకోటె తాలూకా వన్యజీవుల విభాగంలో చోటుచేసుకుంది. డి.బి.కుప్ప వన్య జీవల విభాగం పరిధిలో మాస్తిగుడి కుంబళగొల్లి అటవీ ప్రాంతంలో మగపులి కళేబరాన్ని అటవీ సిబ్బంది గుర్తించారు. దాని వంటిపై గాయలు గుర్తించారు. వెన్నుభాగంలో తీవ్రంగా గాయం కావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఓటు హక్కును

వినియోగించుకోవాలి

మైసూరు: ఓటు హక్కు ఎంతో అమూల్యమైనదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మైసూరు కలెక్టర్‌ రాజేంద్ర అన్నారు. సోమవారం రాత్రి జిల్లా యంత్రాంగం, జిల్లా స్వీప్‌ సమితి, మహానగర పాలికె ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై క్యాండిల్‌ లైట్‌ మార్చ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఓట్లను అమ్ముకోకూడదని, నచ్చిన వారికి తప్పకుండా ఓటు వేయాలన్నారు.

ఉగాది శుభాకాంక్షలు

శివాజీనగర: నూతన సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని కర్ణాటక తెలుగు ప్రజా సమితి రాష్ట్రాధ్యక్షుడు బొందురామస్వామి తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలకు మంచి జరగాలని నూతన తెలుగు సంవత్సరాది ఉగాదిని ఆహ్వానిస్తున్నట్లు బొందురామస్వామి తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతోను, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రకృతిని వేడుకుంటున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని కోరారు.

మరిన్ని వార్తలు