ఘనంగా మద్దూరమ్మ జాతర

22 Mar, 2023 02:04 IST|Sakshi

బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధి హుస్కూరులో మద్దూరమ్మ దేవి జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ పద్దతిలో వివిధ గ్రామాల నుంచి భారీ ఎత్తైన తేర్లు ఎద్దులతో కట్టి లాక్కొని మద్దూరుమ్మ ఆలయం వద్దకు తీసుకుని వచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జాతర ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కమిటీ సభ్యులు పాపణ్ణ, గట్టెళ్లి శ్రీనివాస్‌, కొప్ప మునిరాజు తదితరులు పాల్గొన్నారు.

లోకాయుక్త వలలో ఎస్‌ఐ

యశవంతపుర: హావేరి జిల్లా రాణెబెన్నూరు తాలూకా శహర పోలీసుస్టేషన్‌ ఎస్‌ఐ, డ్రైవర్‌ లోకాయుక్త వలలో చిక్కారు. ఓ వ్యక్తి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త దాడి చేసి పట్టుకుంది. శహర స్టేషన్‌ ఎస్‌ఐ సునీల్‌ తేలి, డ్రైవర్‌ సిచీనలు ఓ వ్యక్తి నుంచి అద్దె డబ్బులు వసూలు చేయడానికి రూ. 50 వేలు డిమాండ్‌ చేశారు. బాధితుడు లోకాయుక్తను ఆశ్రయించాడు. మంగళవారం ఉదయం రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా దావణగెరె లోకాయుక్త సిబ్బంది దాడి చేసి ఇద్దరిని అరెస్ట్‌ చేసి విచారణ అనంతరం జైలుకు తరలించారు.

కాంగ్రెస్‌ హామీలు నమ్మొద్దు : హెచ్‌డీకే

మైసూరు: శాసనసభ ఎన్నికల్లో ప్రజల నుంచి ఓట్లను పొందడానికి కాంగ్రెస్‌ నాయకులు ఇస్తున్న హామీలకు గ్యారెంటీ లేదని, అవి అధికారంలోకి రాగానే డూప్లికేట్‌ కార్డు హామీలుగా మిగిలిపోతాయని జేడీఎస్‌ పార్టీ నేత, మాజీ సీఎం కుమారస్వామి ఎద్దేవా చేశారు. ఈనెల 26న మైసూరు నగరంలో జరిగే పంచరత్న యాత్రపై పార్టీ నాయకులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ... మైసూరు నగరంలోని ఉత్తనహళ్లి సమీపంలో భారీ సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇందుకోసం బృహత్‌ వేదిక సిద్ధమవుతోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతినెల 10 కిలోల బియ్యం, కుటుంబంలోని మహిళకు రూ. 2 వేల నగదు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితం, నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని గ్యారెంటీలేని హామీ ఇస్తున్నారని, ప్రజలు నమ్మకూడదన్నారు. ఓటర్లను మభ్యపెట్టడానికి ఇటువంటి హామీలు ఇస్తున్నారని అన్నారు.

మరిన్ని వార్తలు