ఖరీఫ్‌ సీజన్‌కూ కటకటేనా?

23 Sep, 2023 01:54 IST|Sakshi
హొసపేటె సమీపంలోని తుంగభద్ర డ్యాం

సాక్షి,బళ్లారి: ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి తీవ్ర వర్షాభావ పరిస్థితులతో తుంగభద్ర డ్యాంలోకి నీరు ఆలస్యంగా చేరడంతో రైతులకు కూడా సాగునీటి విడుదలలో జాప్యం జరిగింది. పలు జిల్లాలకు ప్రధానంగా తాగు, సాగునీరందించే తుంగభద్ర డ్యాం ఆయకట్టు పరిధిలో ప్రతి ఏటా హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, ఎల్‌బీఎంసీల కింద లక్షలాది ఎకరాల్లో ఖరీఫ్‌తో పాటు రబీలో కూడా పంటలు సాగు చేసుకుని రైతులు ఆనందంగా ఉండేవారు. ఈ ఏడాది తుంగభద్ర ఆయకట్టులో రెండు పంటలు కాదు కదా కనీసం ఖరీఫ్‌ సీజన్‌లోనైనా రైతులకు పూర్తిగా సాగునీరు అందుతుందా? లేదా? అన్న భయాందోళన రైతులను వెంటాడుతోంది. తుంగభద్ర డ్యాంలోకి ఇన్‌ఫ్లో పూర్తిగా పడిపోయింది. దీంతో డ్యాంలో ఉన్న నీటి నిల్వ క్రమేణా క్షీణిస్తోంది. డ్యాంలో ప్రస్తుతం 62 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. డ్యాం నుంచి ప్రతి రోజు హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, ఎల్‌బీఎంసీ తదితర కాలువలకు దాదాపు 10 వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. దీంతో డ్యాంలో ఉన్న నీటి నిల్వలో ప్రతి రోజు దాదాపు ఒక టీఎంసీ మేర తగ్గుముఖం పడుతోంది. పైగా గాలి, ఎండకు ఆవిరి రూపంలో కూడా దాదాపు 5 టీఎంసీలకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.

12 లక్షల ఎకరాల్లో పంటల సాగు

మూడు రాష్ట్రాల్లో ఆయకట్టు పరిధిలో ఈ ఏడాది 12 లక్షల ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారు. పలు జిల్లాల తాగునీటి అవసరాలకు కూడా నీరు నిల్వ ఉంచుకుని ఖరీఫ్‌ పంటకు నీరు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన వరి, మిర్చి, పత్తి తదితర పంటలు రైతులకు చేతికందాలంటే మరో రెండున్నర నెలల పాటు కాలువలకు నీరు వదలాల్సిన అవసరం ఉంది. డ్యాంలో ఉన్న నీటి నిల్వ ప్రకారం ఐసీసీ సమావేశంలో తీర్మానం చేసిన మేరకు నీటిని సరఫరా చేయడం కష్టతరం అవుతుందని టీబీ బోర్డు అధికారులు అంటున్నారు. డ్యాంలోకి ఇన్‌ఫ్లో రాకపోతే పంట చేతికందడం అనుమానమేనని ఆలస్యంగా సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంట చేతికందినా మిర్చి, పత్తి తదితర పంటలకు మాత్రం డ్యాంలోకి ఇన్‌ఫ్లో రాకపోతే ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. డ్యాంలో ఉన్న నీటిని వృథా చేసుకోకుండా పొదుపుగా వాడుకుంటే ఖచ్చితంగా ఖరీఫ్‌లో వరి పంటను గట్టెక్కించుకోవచ్చంటున్నారు. డ్యాంలో నీటి నిల్వ పెరగకపోతే ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల్లో సాగు చేసిన పంటలు పూర్తిగా చేతికందే అవకాశాలు లేవంటున్నారు.

డ్యాంలో రోజురోజుకు తగ్గుతున్న

నీటి నిల్వ

ఆందోళనలో తుంగభద్ర

ఆయకట్టు రైతులు

మరిన్ని వార్తలు