అంగరంగ వైభవంగా కన్నడ రాజ్యోత్సవం

2 Nov, 2023 04:52 IST|Sakshi
కోలారులో సాధకులకు రాజ్యోత్సవ అవార్డులను అందించిన దృశ్యం

కోలారు: 68వ కన్నడ రాజ్యోత్సవ వేడుకలను బుధవారం నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. జూనియర్‌ కళాశాల మైదానంలో ఉదయం 9 గంటలకు జిల్లాధికారి అక్రం పాషా కన్నడ ధ్వజం, జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కర్ణాటక ఏకీకరణలో ఎంతోమంది మహనీయుల కృషి ఉందన్నారు. కన్నడ భాష, సంస్కృతి రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడాలన్నారు. ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్‌ మాట్లాడుతూ జిల్లాలో భాషాభివృద్ధికి కన్నడాభిమానులు శ్రమించాలన్నారు. కన్నడ భాషకు ఎలాంటి భంగం కలుగకుండా చూడాలన్నారు. ఎంపీ ఎస్‌.మునిస్వామి మాట్లాడుతూ కన్నడ భాష, సంస్కృతికి శాసీ్త్రయ హోదా లభించడంపై హర్షం వ్యక్తం చేశారు.

అంబారీపై ఊరేగిన భువనేశ్వరి దేవి

వేడుకల సందర్భంగా దాదాపు 50కి పైగా స్తబ్ద చిత్ర శకటాలు నగర ప్రముఖ వీధుల్లో సంచరించాయి. భువనేశ్వరి దేవి చిత్రపటాన్ని శకటాల్లో ఉంచి నగరంలోని ఎంజీ రోడ్డు, ఎంబీ రోడ్డు, బస్టాండు సర్కిల్‌ మీదుగా ఊరేగించారు. భువనేశ్వరి దేవి విగ్రహాన్ని అంబారీపై ఉంచి నగరంలో ఘనంగా ఊరేగించారు. కళాబృందాల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లోని 14 మంది సాధకులకు రాజ్యోత్సవ అవార్డులను అందించి సత్కరించారు. ఎమ్మెల్సీలు అనిల్‌కుమార్‌, ఇంచర గోవిందరాజులు, జెడ్పీ సీఈఓ పద్మా బసవంతప్ప, ఎస్పీ ఎం.నారాయణ్‌, తహసీల్దార్‌ హర్షవర్ధన్‌ పాల్గొన్నారు.

కన్నడ భాషే నిత్యం కావాలి

కేజీఎఫ్‌: కన్నడ కేవలం భాష మాత్రమే కాకుండా మన నిత్య జీవితంలో భాగం కావాలని ఎమ్మెల్యే రూపా శశిధర్‌ తెలిపారు. బుధవారం జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన 68వ కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. కన్నడ భవన నిర్మాణానికి తన అభివృద్ధి నిధుల నుంచి రూ.20 లక్షలు అందిస్తానన్నారు. ప్రతి ఒక్కరూ కన్నడ భాషపై స్వాభిమానాన్ని కలిగి ఉండాలన్నారు. అనంతరం స్తబ్ద చిత్రాల ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పి శాంతరాజ్‌, తహసీల్దార్‌ నాగవేణి, నగరసభ కమిషనర్‌ పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ కార్యాలయంలో..

నగరంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం 68వ కన్నడ రాజ్యోత్సవ వేడుకలను ఎస్పీ శాంతరాజ్‌ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కన్నడ ధ్వజారోహణ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ బంగారు గనులకు ప్రఖ్యాతి గాంచిన కేజీఎఫ్‌ కన్నడ నాడుకు మకుటం లాంటిదన్నారు. సమసమాజ నిర్మాణానికి ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ పాండురంగ, సహాయక పాలనాధికారి జి.విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

మాలూరులో..

మాలూరు: పట్టణంలో 68వ కన్నడ రాజ్యోత్సవ వేడుకలను బుధవారం విశేషంగా నిర్వహించారు. ఉదయం జూనియర్‌ కళాశాల మైదానంలో కన్నడ ధ్వజాన్ని ఎమ్మెల్యే కె వై నంజేగౌడ ఆవిష్కరించారు. అనంతరం కన్నడ స్తబ్ద చిత్రాల ఊరేగంపును ప్రారంభించారు. పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం నుంచి కన్నడ మాత భువనేశ్వరి దేవి చిత్రపటాల పల్లకీలను, భువనేశ్వరి దేవి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించి ట్రాక్టర్‌లో ప్రతిష్టించి ప్రధాన వీధుల్లో వివిధ కళాబృందాలతో ఊరేగించారు. మాజీ ఎమ్మెల్యే ఏ.నాగరాజ్‌, తహసీల్దార్‌ కే.రమేష్‌, టీపీ ఈఓ కృష్ణప్ప, కసాప అధ్యక్షుడు ఎంవీ హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.

కన్నడ భాష రక్షణ అందరి బాధ్యత

శ్రీనివాసపురం: కన్నడ నేల, నీరు, భాషను రక్షించడం మనందరి బాధ్యత అని ఎమ్మెల్యే జీకే వెంకటశివారెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని బాలికల జూనియర్‌ కళాశాలలో 68వ కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. కన్నఢ భాషాభిమానం కలిగి ఉండాలన్నారు. నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి తాను శ్రమిస్తున్నానన్నారు. పట్టణంలో రూ.25 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు. కోలారు రహదారి విస్తరణకు రూ.40 కోట్ల వ్యయంతో పనులను త్వరలో ప్రారంభిస్తున్నామన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం వచ్చే ఏడాది మార్చిలోగా జలజీవన్‌ మిషన్‌ పథకం కింద ప్రతి ఇంటికీ, ప్రతి గ్రామానికి కొళాయి కనెక్షన్‌ ఇప్పిస్తామన్నారు. కార్యక్రమంలో టెన్త్‌, ఇంటర్‌లో కన్నడ భాషలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. తహసీల్దార్‌ శరీన్‌తాజ్‌, పురసభ ముఖ్యాధికారి వైఎన్‌ సత్యనారాయణ, బీఈఓ కె భాగ్యలక్ష్మి, కోశాధికారి కుముద, కెఎల్‌ జయరాం, బలరామేచంద్రగౌడ తదితరులు పాల్గొన్నారు.

సాధకులకు అవార్డులతో సన్మానం

అలరించిన స్తబ్ద చిత్ర శకటాల ఊరేగింపు

మరిన్ని వార్తలు